వెళ్లొద్దామా : ఏడుపాయలలో జాతర సందడి

EDUPAYALAశివరాత్రి వస్తుందంటే… ఏడుపాయలకు కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం.. గంగమ్మ ఉరకలెత్తిస్తుంది. అక్కడ కొలువైన దుర్గాదేవి మేలిమి బంగారపు ఛాయలో మెరుస్తుంటుంది. తెలంగాణలోనే అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటి ఏడుపాయలలోని దృశ్యాలివి. శివరాత్రి సమీపిస్తుండటంతో ఏడుపాయల జాతరతో సందడిగా మారింది. రాష్ట్రంలో జరిగే జాతరలలో ఏడుపాయల జాతరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భారీ భక్త జనసంద్రంతో ఏడుపాయలు కిటకిటలాడుతోంది. తెలంగాణ ప్రజలేకాక..చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి వేల భక్తులు ఏడుపాయలకు చేరుకున్నారు. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం మెదక్ జిల్లా సమీపంలో ఉంది. గోదావరికి ఉపనది మంజీరా నది ఇక్కడ ఏడు పాయలుగా చీలిపోయి … ఆ తరువాత ఒక్కటిగా కలిసిపోతుంది.

ఈ ఏడు పాయల మధ్య ప్రదేశంలోని ఓ గుహలో దుర్గాదేవి దర్శనమిస్తుంది. ఈ క్షేత్రం అరణ్య ప్రదేశంలో వెలిసిన కారణంగా ఇక్కడి అమ్మవారిని వనదుర్గగా భక్తులు భావిస్తారు. ఏడు పాయలను అత్రి … వశిష్ఠ … కశ్యప … విశ్వామిత్ర … జమదగ్ని … గౌతమి … భరద్వాజ అనే సప్త ఋషులకు ప్రతీకగా చెబుతారు. మామూలు రోజుల్లో ఇక్కడ జనసంచారం కనిపించదు … శివరాత్రి వచ్చిందంటే చాలు వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ సందర్భంగా పది రోజులపాటు ఏడుపాయలలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. పరవళ్లు తొక్కే ఏడుపాయలు … పాపాలను కడిగేసే కనకదుర్గమ్మ ..ఎందరో కవుల హృదయాలను స్పందింపజేశాయి. వారి కలాలను పరుగులు తీయించాయి.

సర్పయాగం చేసిన ప్రదేశం

పూర్వం జనమేజయ మహారాజు తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆయన సర్పయాగం చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు. అందుకు నిదర్శనంగా ఈ పరిసరాల్లో ఇసుక మేటల కింద లభించే మెత్తటి బూడిదను చూపిస్తారు. సర్ప జాతులన్నీ సర్పయాగానికి ఆహుతి అవుతుండటంతో, వాటికి పుణ్యలోకాలు కల్పించడం కోసం గరుత్మంతుడు … గంగను ఇక్కడికి తీసుకు వచ్చాడని చరిత్ర. ఈ కారణంగానే ఇక్కడి మంజీరాను గరుడ గంగ అని పిలుస్తారు. ఈ గంగలో భక్తులు స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబళ్లు చెల్లిస్తారు.

ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

మేదక్ జిల్లా ఏడు పాయల జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తుంది సర్కార్.  మంగళవారం (ఫిబ్రవరి- 13) నుంచి ప్రారంభం కానున్న జాతర కోసం కోటీ 50 లక్షలు విడుదల చేసింది. జాతర గొప్పగా నిర్వహించాలని…భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates