వేములవాడలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

rajanna-vemulawadaవేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని ఇవాళ్టి (సోమవారం,ఫిబ్రవరి-12) రాజన్న ఆలయంలో 3 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. రాత్రి 9 గంటలకు నిశిపూజ తర్వాత మహాశివరాత్రి పూజలు ప్రారంభమవుతాయి. ఆలయంలో ఆర్జిత సేవలను రద్ద చేసి భక్తులకు లఘు దర్శనం అమలు చేస్తున్నారు. కోడె మొక్కులను యథాతథంగా ఆలయ సిబ్బంది కొనసాగించనున్నారు.

రేపు(మంగళవారం-13) అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు  స్థానికులకు సర్వదర్శనం కల్పిస్తారు. రేపు తెల్లవారుజామున 3.30 నుంచి 4 వరకు మంగళవాద్యాలు, ఆలయ శుద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. రేపు (మంగళవారం-13) ఉదయం 4 నుంచి 6 వరకు సుప్రభాతం, ప్రాతఃకాలపూజ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. తర్వాత ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. రేపు(మంగళవారం-13)  సాయంత్రం 4 గంటలకు శివదీక్ష మాలధారులను దర్శనానికి అనుమతించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయంలో మహాలింగార్చన అభిషేకం జరుగుతుంది. రాత్రి 11.35 గంటలకు రుత్వికులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఎల్లుండి (బుధవారం-14) వేకువజామున స్వామివారికి సుప్రభాతం, ప్రాతఃకాల పూజలు, ఆర్జితసేవలు నిర్వహిస్తారు.

Posted in Uncategorized

Latest Updates