వేల మంది విద్యార్థులు అర్హులు : JEE లో కటాఫ్ మార్కులు తగ్గింపు

JEEJEE అడ్వాన్స్ డ్ లో కటాఫ్ మార్కులను తగ్గించారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 18 వేల138 మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించింది. ఇంత తక్కువ మొత్తంలో విద్యార్థులు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలోనే అధికారులు గురువారం (జూన్-14) జరిగిన సమావేశంలో అర్హుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనరల్ 90, OBC 81, SC STలకు 45 మార్కుల చొప్పున కటాఫ్ గా నిర్ణయించారు.

దీంతో, మరో 13వేల850 మంది విద్యార్థులకు అవకాశం లభించింది. జూన్ 15 నుంచి జూన్ 25 వరకు ఆన్‌ లైన్‌ లో దేశంలోని అన్ని నిట్, IITల్లో అడ్మిషన్ల కోసం వెబ్ ఆప్షన్లు, ఛాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవాలని వరంగల్ లోని నిట్ అడ్మిషన్ల చైర్మన్ ప్రొఫెసర్ శివశర్మ సూచించారు. నిట్ వరంగల్‌ లోని ఆడిటోరియంలో గురువారం (జూన్-14) నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పలు సూచనలు చేశారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిట్ అడ్మిషన్‌ల విభాగం అధికారులు కళాశాలల, కోర్సుల ఎంపిక, వెబ్ ఆప్షన్లు నింపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

జూన్ 15 నుంచి 25 వరకు జోసా వెబ్‌ సైట్‌ లో పొందుపరిచిన సూచనల మేరకు జాగ్రత్తగా ఛాయిస్ ఫిల్లింగ్ చేయాలని తెలిపారు. మొదట జూన్ 25 వరకు మాత్రమే అందుబాటులో ఉండే జోసా వెబ్‌ సైట్‌ లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత కశాశాలలను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థి కూడా మంచి కళాశాలనే మొదటి ప్రిఫరెన్స్‌ గా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్లాలని నిట్ అధికారులు సూచించారు. ఆప్షన్ల ఎంపిక తరువాత వెంటనే లాక్ చేయకూడదన్నారు. జూన్ 25 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది కనుక చేరాలనుకుంటున్న కళాశాల, కోర్సుల వివరాలను సేకరించుకున్న తరువాతే లాక్ చేయాలి. లేదంటే అత్యంత కీలకమైన దశలో మంచి సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.

గత ఏడాది ఏఏ కళాశాలల్లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీట్లు వచ్చాయో తెలుసుకోవడానికి సంబంధిత వెబ్‌ సైట్‌ లలో వివరాలను పొందుపరిచారు. వాటిని సరిపోల్చుకొని ఒక అంచనాతో ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. www.josaa.nic.in వెబ్‌ సైట్‌ లో లాగిన్ అయి వెబ్ ఆప్షన్‌లు ఇచ్చుకోవచ్చు. జూన్ 25 వరకు వెబ్ ఆప్షన్‌ లు ఇచ్చిన విద్యార్థులకు జూన్ 27 నుంచి సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు జూన్ 28 నుంచి సమీప కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. IIT లో సీటు వచ్చిన వారు తమకు దగ్గరలో ఉన్న IIT కళాశాలల్లో, NIT లో వస్తే సమీప NIT లో విధిగా రిపోర్ట్ చేయాలని సూచించారు నిట్ అడ్మిషన్‌ ల అధికారులు.

Posted in Uncategorized

Latest Updates