వైభవం తీసుకొస్తా : మోజంజాహీ మార్కెట్ దత్తత తీసుకున్న IAS

j-marketహైదరాబాద్ వారసత్వ సంపదకు ప్రతీక మోజంజాహీ మార్కెట్. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. ఈ చారిత్రక సంపదకు వైభవం తీసుకురావటంతో పాటు భవిష్యత్లో మోజంజాహీకి ప్రముఖ స్థానం కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఈ అద్భుత కట్టడానికి మరమ్మతులు చేసి.. కొత్త హంగులు అద్దే దిశగా కసరత్తు సాగుతోంది.

మోజంజామీ మార్కెట్ ను మార్చేందుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ముందుకొచ్చారు. మోజంజాహీ మార్కెట్ ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మూడు, నాలుగు నెలల్లో మార్కెట్ కు నిజాం కాలం నాటి అందాలను తిరిగి తెస్తాను అంటూ ట్వీట్ చేశారు. నగర ప్రజలు కూడా తగిన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు.

నగరంలోనే ప్రముఖ మార్కెటైన మెహబూబ్ చౌక్ బజార్, రెడెన్సీ బజార్, బేగంబజార్ లో తగినంత స్థలం లేక పోవడంతో అన్ని సరుకులు ఒకే దగ్గర యూనివర్స్ ల్ స్టోర్స్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఎంజే మార్కెట్ ను నిర్మించారు. నిజాం రెండో కుమారుడు ప్రిన్స్ మొజాంజా బహదూర్ ఆధ్వర్యంలో 1935 మోజంజాహీ మార్కెట్ ను నిర్మించారు.

ప్రత్యేక వాస్తు రీతిలో, గ్రానైట్ రాయితో ఈ నిర్మాణం జరిగింది. 1.77 ఎకరాల విస్తీర్ణంలో 1947 వరకు ప్రముఖ పాన్ బజార్ గా ఉంది. తర్వాత మార్కెట్ లో ఆక్రమణలు పెరగడంతోపాటు.. ప్లోరింగ్ దెబ్బతింది. ఒకప్పుడు ఎంతో సుందరంగా ఉన్న మార్కెట్ ప్రస్తుతం బోర్డులు, ఫ్లెక్సీలు, వేలాడే కేబుల్స్ తో వైభవాన్ని కోల్పోయింది.

ఎంజే మార్కెట్ లోని 189 షాపుల్లో కేవలం 17 దుకాణాల వాళ్లు మాత్రం 25 ఏళ్లలోపు లీజులో ఉన్నారు. మిగతా వారంతా 25 ఏళ్లకు పైగా ఉంటున్నారు. ఐదేళ్ల క్రితం కూడా దీన్ని పున:రుద్దరించాలని భావించినా పనులు ముందుకు సాగలేదు. కెమికల్ క్లీనింగ్ చేయాలని.. దెబ్బతిన్న ఫ్లోరింగ్ కు మరమ్మతులతో పాటు ఇతర పనులు చేయాలని నిర్ణయించారు. రూ.3 కోట్ల ఖర్చు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఆ పనులు ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే IAS అరవింద్ కుమార్ దత్తత తీసుకోవటంతో మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates