శబరిమలలో 39 మందికి కరోనా పాజిటివ్

శబరిమలలో 39మంది ఆలయసిబ్బంది, భక్తులకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ట్రావెన్‌కోర్‌ దేవస్థాన బోర్డు (టీడీబీ) తెలిపింది. వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో 27మంది ఆలయ సిబ్బంది సహా 39 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బోర్డు అధికారులు తెలిపారు.

కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు. అందులో భాగంగా పరీక్షలు చేయించామన్నారు. సన్నిధానం, పంబా, నీలక్కల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పాయింట్లలో మొత్తం 39 కేసులు నమోదైనట్లు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న టైంలో యాత్రికులు వచ్చే ప్రాంతాలైన తిరువనంతపురం, తిరువళ్ల, చెంగనూర్‌, కొట్టాయం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో యాంటిజెన్‌ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా నిబంధనల ప్రకారం 10 నుంచి 60 ఏళ్ల వయసున్న వారినే ఆలయంలోనికి అనుమతిస్తున్నామని తెలిపారు. స్పెషలిస్టులతో కూడిన మెడికల్ టీంలను ఆలయంలో విధులు నిర్వర్తించేందుకు ఏర్పాటు చేశామని టీడీబీ అధికారులు తెలిపారు.

ప్రతి ఏటా డిసెంబరు 26న మండలపూజ నిర్వహిస్తారు. జనవరి 14న మకరవిళక్కు నిర్వహించిన తర్వాత జనవరి 20న ఆలయాన్ని మూసేస్తారు. ప్రస్తుతం కరోనా మొదలైన తర్వాత వార్షిక పూజల కోసం మొదటిసారి ఆలయాన్ని తెరిచారు.

Latest Updates