శబరిమల ఇష్యూ : దేవుడి బ్రహ్మచర్యాన్ని కాపాడాలంటూ సుప్రీంలో వాదన

శబరిమల అయ్యప్పస్వామి బ్రహ్మచర్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగంలో నిబంధనలున్నాయని సుప్రీంకోర్టుకు తెలిపింది నాయర్‌ సర్వీస్‌ సొసైటీ. ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఈ సొసైటీ వ్యతిరేకిస్తుంది. ఈ సంస్థ తరఫు లాయర్‌ కె.పరాశరన్‌ నిన్న(బుధవారం- జూలై 25న) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పరిశీలించదగ్గ అంశం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యమే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

‘ ఆలయంలోకి వచ్చే వారు యువతులు, మహిళలను వెంట తీసుకురావొద్దు. పిల్లలు, తల్లి, సోదరికి మినహాయింపు ఉంటుంది. సందర్శకులు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని దీనర్థం కాదు. కానీ వారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లు కనిపించాలి. దేవాలయాల్లోకి అన్ని వర్గాలను అనుమతించాలన్న రాజ్యాంగ నిబంధన 25(2) సామాజిక సంస్కరణలకే పరిమితం. 26(బి) నిబంధన కింద చేర్చిన మత వ్యవహారాలకు కూడా వర్తించదు’ అని స్పష్టం చేశారు పరాశరన్‌. మహిళలను ఆలయాల్లోకి అనుమతిస్తూ ప్రభుత్వం చట్టం చేస్తే పరిస్థితి ఏంటని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించగా.. ఇలాంటి సంప్రదాయాలను పరిశీలిస్తున్న సమయంలో అక్కడి ప్రధాన దైవం ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగపరంగా ఆ దేవుడికి రక్షణ కల్పించాలన్నారు ఆయన. శబరిమల దైవం బ్రహ్మచర్యంపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates