శామీర్ పేటలో యువకుడి దారుణ హత్య

రంగారెడ్డి: యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్యచేసిన సంఘటన ఆదివారం డిసెంబర్-9న శామీర్‌ పేట మండలం అంతాయిపల్లి దగ్గర జరిగింది. తూంకుంటకి చెందిన మునిగొండ రమేష్‌ (24) దేవేందర్‌, శాంతమ్మల మూడో సంతానం. రమేష్‌ ఏ ఉద్యోగం లేక ఇంట్లోనే ఉంటున్నాడు. అంతాయిపల్లి సమీపంలోని కల్వర్టు దగ్గర ఓ శవం ఉందనే సమాచారం స్థానికులు పోలీసులకు అందజేశారు.

సంఘటన స్ధలానికి వచ్చిన సీఐ నవీన్‌ రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వ్యక్తి హత్యకు గురైనట్లు నిర్ధారించి క్లూస్‌, డాగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ లకు సమాచారమందించారు. స్ధలానికి వచ్చిన క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు.  అప్పటికే మృతుడి బంధువులు, గ్రామస్ధులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ కొడుకును ఎవరో హత్య చేసి ఇక్కడ పడేశారంటూ ఆరోపిస్తూ మృతుడి తల్లి శాంతమ్మ, తండ్రి దేవేందర్‌, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కొద్ది రోజుల క్రితమే పెద్ద కొడుకు మృతి చెందాడని అది మరువక మునుపే మరో కొడుకు హత్యకు గురికావడంతో .. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates