శీతాకాల విడిది కోసం…21న రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి

ఈనెల 21న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజుల పాటు కోవింద్ బస చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి శీతాకాల విడిది ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి.. మిలటరీ, పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి విడిది ఏర్పాట్లను సమన్వయం చేసుకోవాలని వివిధ శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. రోడ్లకు రిపేర్లు, పారిశుద్ధ్యం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రపతి నిలయంలో సీసీ టీవీలు, వైద్య బృందాలు, టెలిఫోన్, డైలీ పేపర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

ఈనెల 21న సాయంత్రం 5 గంటలకు హకీంపేటకు రాష్ట్రపతి కోవింద్ చేరుకోనున్నారు. 22న కరీంనగర్ లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 23న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 24న రాష్ట్రపతి కోవింద్ తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates