శ్రీదేవి మృతితో సినీ ఇండస్ట్రీ షాక్

industryఅతిలోక సుంద‌రి శ్రీదేవి హ‌ఠాన్మ‌ర‌ణం అటు సినీ ప‌రిశ్ర‌మ‌ను, ఇటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నాలుగేళ్ల వ‌య‌సులోనే బాల‌న‌టిగా వెండితెర అరంగేట్రం చేసిన శ్రీదేవి.. 16 ఏళ్ల వ‌య‌సు సినిమాతో హీరోయిన్‌గా త‌న ప్ర‌స్తానాన్ని మొద‌లుపెట్టింది. ఆ సినిమాలో హీరోగా నటించిన చంద్ర‌మోహ‌న్‌ ఆమె మ‌ర‌ణ వార్త విని షాక్‌కు గుర‌య్యారు. ఆమె మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని చంద్ర‌మోహ‌న్ అన్నారు. బాల‌న‌టిగా మొద‌లుపెట్టి ఈ స్థాయికి చేరుకున్న వాళ్లు చాలా త‌క్కువ‌ని, త‌న ఒడిలో ఆడుకున్న శ్రీదేవి.. త‌ర్వాత కాలంలో త‌న సినిమాతోనే హీరోయిన్‌గా అరంగేట్రం చేసింద‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఆమె ప‌క్క‌న న‌టించినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నానని చంద్రమోహన్ తెలిపారు.

శ్రీదేవిని దేవ‌త‌గా ఆరాధించే రామ్ గోపాల్ వ‌ర్మ‌, ఆమె లేర‌నే వార్త‌ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. దేవుణ్ణి ఎప్పుడు ఇంత‌లా ద్వేషించ‌లేదంటూ ట్వీట్ చేశారు. కాంతికన్నా ఎక్కువ ప్రకాశవంతమైనది నేడు మనకు దూరమైందని, లోకం విడిచిపోయిన శ్రీదేవి అంటే తనకు చాలా కోపమని, శ్రీదేవి ఏ లోకంలో ఉన్నా… ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని, ఆమె భర్త బోనీ కపూర్ గురించి ఆలోచిస్తేనే చాలా ఆవేదనగా ఉందని, శ్రీదేవి నిజంగానే చనిపోయిందా? ఎవరైనా నన్ను నిద్రలేపి, ఇదొక పీడకల మాత్రమే అని చెప్పగలరా? అంటూ శ్రీదేవి మరణం పట్ల తన భాధను రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.  అస‌లు అందరినీ ఇలా వదిలేసి ఆమె ఒంటరిగా ఇలా ఎలా వెళ్తుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే శ్రీదేవి మ‌ర‌ణానికి కొద్ది సేప‌టి ముందు అమితాబ్ చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఈ ట్వీట్‌పై ఆసక్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఎందుకో తెలియదు, ఎన్నడూ లేనంత ఆందోళనకు గురవుతున్నానంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు.

శ్రీదేవి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘‘ఆమె వచ్చింది.. ఆమె చూసింది. ఆమె అందరినీ తన వశం చేసుకుంది. తను ఎక్కడినుంచైతే వచ్చిందో ఆ స్వర్గానికే తిరిగి వెళ్లిపోయింది. శ్రీదేవిగారి ఆత్మకు శాంతి కలగాలి. ఆమె లేని లోటు పూడ్చలేనిది అంటూ జూనియర్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ ట్వీట్‌కు వర్మ రిప్లై ఇచ్చారు. ఎప్పటికీ మరచిపోలేని అత్యంత అందమైన సోల్ అని వర్మ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates