శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘే

శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘే తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఇవాళ(ఆదివారం) ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కొద్ది నెలలుగా శ్రీలంకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. నిన్న ప్రధాని పదవికి మహింద రాజపక్సె రాజీనామా చేయడంతో… శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ్ సింఘేతో ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రమాణ స్వీకారం చేయించారు. కొన్ని కారణాలతో అక్టోబర్‌ 26న.. ప్రధానిగా ఉన్న విక్రమ్ సింఘేను పదవి నుంచి తప్పించి మహింద రాజపక్సెను ఆ పదవిలో నియమిస్తూ మైత్రిపాల సిరిసేన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న రాజపక్సె పార్లమెంట్ లో తన మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉండగా.. రెండు సార్లు జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. దీంతో పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు  ఇస్తూ మైత్రిపాల సిరిసేన మరో ప్రకటన చేశారు. అయితే దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. పార్లమెంట్‌ రద్దు చెల్లదని కోర్టు తెలిపింది. మరోవైపు రాజపక్సె ప్రధానిగా పదవిలో కొనసాగడం కూడా తగదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో చివరకు మహింద రాజపక్సె ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

Posted in Uncategorized

Latest Updates