శ్రీలంక ప్రధాని పదవికి రాజపక్సె రాజీనామా

 

శ్రీలంకలో కొద్ది నెలలుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ దేశ ప్రధాని పదవికి మహింద రాజపక్సె ఇవాళ(డిసెంబర్ 15) రాజీనామా చేశారు. ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ్ సింఘేను పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో ఈ ఏడాది అక్టోబర్ 26న మహింద రాజపక్సెను నియమిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రధాని బాధ్యతలు తీసుకున్న రాజపక్సె పార్లమెంట్ లో తన మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉండగా.. రెండు సార్లు జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు.

దీంతో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు నవంబరు 9న మైత్రిపాల సిరిసేన మరో ప్రకటన చేశారు. అయితే దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. పార్లమెంట్‌ రద్దు చెల్లదని కోర్టు తెలిపింది. మరోవైపు రాజపక్సె ప్రధానిగా కొనసాగకుండా అప్పీల్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై రాజపక్స సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. అప్పీల్‌ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీం కోర్టు నిర్ణయంతో మహింద రాజపక్సె అధ్యక్షుడితో చర్చలు జరిపి చివరికి ఇవాళ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. మరోవైపు రాజపక్సె రాజీనామాతో రణిల్ విక్రమ్ సింఘే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 

Posted in Uncategorized

Latest Updates