శ్రీశైలానికి భారీగా వరద నీరు

శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకు కృష్ణా పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వరద ఏమాత్రం తగ్గకపోవడంతో దిగువ ప్రాజెక్టులకు స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. శ్రీశైలానికి శనివారం వరకు 1.88 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. శుక్రవారం సాయం త్రం ఆరు నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకూ 16 టీఎంసీలు జలాశయంలోకి చేరాయి. పది, పదిహేను రోజులపాటూ ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశముందని నీటి పారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

శనివారం (జూలై-21) ఆల్మట్టి నుంచి 1.73 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ఆ నీటినంతా దిగువ నారాయణపూర్‌కు వదిలేస్తున్నారు. అక్కడి నుంచి 1.83 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసి, వాగులు వంకలు పొంగడంతో 1.90 లక్షల క్యూసెక్కుల నీరు జూరాలకు వస్తోంది. జూరాల నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 1.98 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర వరదను దిగువకు వదులుతున్నా రు. దాంతో శ్రీశైలంలోకి శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, సాయంత్రానికి 1.88 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 825 అడుగుల్లో 46 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం జలాశయం నిండా లంటే సుమారు 170 టీఎంసీలు అవసరం. ఒకవేళ వరద తగ్గి కర్ణాటక ప్రాజెక్టుల గేట్లు మూసినా ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా నదీ గర్భంలోనే 70 నుంచి 80 టీఎంసీల నీరు ఉంటుందని, తుంగభద్ర నుంచి శ్రీశైలం మధ్యలోనూ మరో 30 టీఎంసీల నీరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టులో శ్రీశైలం నుంచి సాగర్‌లోకి నీటి విడుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates