సంగమేశ్వరం పాత ప్రాజెక్టే

ఎన్జీటీలో ఏపీ అడ్డగోలు వాదన

ఇప్పటికే ఉన్నవాటికి నీళ్లివ్వడానికే రాయలసీమ లిఫ్ట్

​రిపేర్లే చేస్తున్నామని వెల్లడి

శ్రీశైలం నుంచి రాయలసీమకు అసలు కేటాయింపులేలేవన్న తెలంగాణ

ప్రాజెక్ట్​తో టైగర్ రిజర్వు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు ప్రమాదమని వివరణ

తీర్పు రిజర్వ్​ చేసిన ఎన్జీటీ బెంచ్ ..

హైదరాబాద్​, వెలుగు: సంగమేశ్వరం పాత ప్రాజెక్టేనని, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు నీళ్లిచ్చేందుకే రాయలసీమ లిఫ్ట్​ను చేపడుతున్నామని ఏపీ వాదించింది. ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేవని, కేవలం పంపింగ్​, రిపేర్లు మాత్రమే చేస్తున్నామని చెప్పింది. సంగమేశ్వరం లిఫ్ట్​, పోతిరెడ్డిపాడు విస్తరణపై గవినోళ్ల శ్రీనివాస్​ దాఖలు చేసిన పిటిషన్​పై గురువారం ఎన్జీటీ చెన్నై బెంచ్​ జ్యుడీషియల్​ మెంబర్​ జస్టిస్​ రామకృష్ణన్​, టెక్నికల్​ మెంబర్​ సైబర్​ దాస్​ గుప్తాలు విచారించారు. ఏపీ తరఫున  సీనియర్​ లాయర్​ వెంకటరమణి, తెలంగాణ తరఫున ఏఏజీ రామచందర్​రావు వాదనలు వినిపించారు. సంగమేశ్వరం నుంచి అదనంగా నీటిని తీసుకోవట్లేదని, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు నీటిని ఇవ్వడానికే లిఫ్ట్​ స్కీమును మొదలుపెట్టామని వెంకటరమణి వివరించారు. పాత ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయి కాబట్టి కొత్త ప్రాజెక్టుకు అవసరం లేదని వాదించారు. ఎన్జీటీలో గవినోళ్ల శ్రీనివాస్​ వేసిన పిటిషన్​ను తెలంగాణ ప్రభుత్వం ఎలా సొంతం చేసుకుంటుందని ప్రశ్నించారు. ప్రాజెక్టు వల్ల రాయలసీమలో పర్యావరణం పాడవుతుందని పిటిషనర్​ వాదించడం మొసలి కన్నీరు కార్చడం వంటిదేనని, ఇది సరికాదని అన్నారు. ఈ నీటి గొడవ అపెక్స్​ కౌన్సిల్​ ముందు తేలుతుందని, దీనిని ఎన్జీటీ ముందు ప్రస్తావించడమే సరికాదని అన్నారు.

మరోసారి విస్తరిస్తున్నరు

ఏపీ గతంలో నిర్మించిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టే అక్రమ ప్రాజెక్ట్​ అని, ఇప్పుడు దాని కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని రామచందర్​రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోతిరెడ్డిపాడును విస్తరించారని, ఇప్పుడు మరోసారి విస్తరిస్తున్నారని ట్రిబ్యునల్​కు తెలియజేశారు. సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​ భారీ ఎక్స్​పాన్షన్​ ప్రాజెక్ట్​ అని చెప్పారు. ఏ ప్రాజెక్టుకైనా ముందుగా అనుమతులు తీసుకోవాలని, కానీ, ఏపీ సర్కార్​ ఆ రూల్స్​ ఏవీ పట్టించుకోవట్లేదని అన్నారు.  అసలు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు ఎలాంటి నీటి కేటాయింపులు లేవన్నారు. చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు తప్ప సాగునీటికి నీళ్లు తీసుకోవడానికి అవకాశమే లేదన్నారు. సంగమేశ్వరం లిఫ్ట్​ కట్టొద్దని, టెండర్లు కూడా పిలవొద్దని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినా ఏపీ ముందుకే పోతోందని వాదించారు. కొత్త ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతంలో పర్యావరణం బాగా దెబ్బతింటుందని, టైగర్​ రిజర్వ్​తో పాటు వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ప్రమాదంలో పడుతాయని వివరించారు. వాటిని లెక్కలోకి తీసుకుని ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్​ క్లియరెన్స్​ తీసుకునేలా ఏపీని ఆదేశించాలని బెంచ్​ను కోరారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో పర్యావరణ శాఖ అధికారి కెర్కటా తప్పుడు నివేదిక ఇచ్చారని పిటిషనర్​ తరఫు లాయర్​ శ్రవణ్​ కుమార్​ అన్నారు. ఇండిపెండెంట్​గా నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా రిపోర్ట్​ ఇచ్చారన్నారు. నీటి తరలింపు కోసం చేపడుతున్న ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలవనరుల శాఖనే సుప్రీం అని, ఆ శాఖ అభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోవాలని కోరారు. అందరి వాదనలు విన్న బెంచ్​.. తీర్పును రిజర్వ్​ చేసింది. రాతపూర్వక వాదనలకు వారం టైమ్​ ఇచ్చింది.

Latest Updates