సంచలనం.. షాకింగ్ : ఇద్దరు పోలీసులకు మరణ శిక్ష

దేశంలోనే మొదటిసారి కావొచ్చు.. ఇద్దరు పోలీసులకు కోర్టు మరణ శిక్ష విధించింది. అవును.. ఇది నిజం. కేరళలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అదే విధంగా అప్పటి కమిషనర్, సీఐ, ఎస్సైలకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని పోర్ట్ పోలీస్ స్టేషన్. 2005 సెప్టెంబర్ 27వ తేదీన ఉదయ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడిని శ్రీకంటేశ్వరం పార్కులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.4వేల చోరీ కేసులో విచారించారు. విచారణ సమయంలో యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో అతను పోలీస్ స్టేషన్ సెల్ లోనే చనిపోయాడు. పోస్టుమార్టం నివేదికలో యువకుడు ఉదయ్ కుమార్ శరీరంలో 22 గాయాలు ఉన్నాయని.. ఎముకలు విరిగి కూడా ఉన్నాయని తేలింది. 2005లో దీనిపై కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. పోలీసుల వైఖరిపై నిరసనలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పట్లో కానిస్టేబుళ్లు కె.జితాకుమార్, ఎస్.వి.శ్రీకుమార్ లను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఉదయ్ కుమార్ తల్లి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు 2007లో సీబీఐ రంగంలోకి దిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసింది. థర్డ్ డిగ్రీ ఉపయోగించారని నిర్ధారించింది. అయితే పోలీస్ స్టేషన్ లో జరిగిన లాకప్ డెత్ లో సాక్ష్యాలు తారుమారు చేయటం, కేసును పక్కదారి పట్టించటానికి సహకరించారని, ఉదయ్ కుమార్ పై తప్పుడు కేసు పెట్టారంటూ అప్పటి పోలీస్ కమిషనర్ కె.హరిదాస్, సీఐ ఈ.కె.సాబు, ఎస్సై అజిత్ కుమార్ లకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించింది కేరళ సీబీఐ కోర్టు. ఈ కేసులో A3గా ఉన్న మరో కానిస్టేబుల్ సోమ విచారణ సమయంలో చనిపోయారు.

లాకప్ డెత్ లో చనిపోయిన ఉదయ్ కుమార్ తల్లి 64 ఏళ్ల ప్రభావతి అలుపెరగని పోరాటం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. నా కుమారుడు నిర్ధోషి.. పోలీసులు కొట్టి చంపారు అంటూ 12 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. స్టేషన్ లో చంపిన పోలీసులకు శిక్ష పడాలని కోరారు. ఆమె న్యాయపోరాటం ఫలించింది. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు మరణశిక్షతోపాటు.. కమిషనర్, సీఐ, ఎస్సైలకు మూడేళ్ల జైలు కూడా విధించింది సీబీఐ కోర్టు. మరణ శిక్ష పడిన ఇద్దరు కానిస్టేబుళ్లకు రూ.2లక్షల జరిమానా కూడా విధించింది న్యాయస్థానం.

Posted in Uncategorized

Latest Updates