సంచలన ఆదేశాలు : సినిమా హాల్స్, మల్టీప్లెక్సుల్లోకి బయట ఫుడ్ తీసుకెళ్లండి

నిజంగా ఇది గుడ్ న్యూస్.. అయితే మన తెలంగాణలో కాదు.. ఇది మహారాష్ట్రలో. అవును అక్కడి ప్రభుత్వం మల్టీఫ్లెక్సులు, మాల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. మల్టీఫ్లెక్స్ ధియేటర్లకు బయట నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్లవచ్చని.. మాల్స్ కూడా అనుమతించాలంటూ మహారాష్ట్ర సివిల్ సప్లయ్ మినిస్టర్ రవీంద్ర చవాన్ ప్రకటించారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు మంత్రి. ఇటీవల మహారాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. సినిమా హాల్స్, మల్టీఫ్లెక్సుల్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశంలో ఉన్నాయని.. 50 రూపాయల విలువ చేయని పాప్ కార్న్ ఏకంగా 350 రూపాయలు వసూలు చేస్తున్నారని.. బయట 20 రూపాయల కూల్ డ్రింక్.. అక్కడ 150 రూపాయలు వసూలు చేస్తున్నారని ఉద్యమం చేపట్టింది.

దీనికితోడు బాంబే హైకోర్టులో పిటీషన్లు వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బయట ఫుడ్ ఎందుకు మాల్స్, సినిమా హాల్స్ లోకి తీసుకెళ్లకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అదే విధంగా ఎందుకు ధరలను నియంత్రించలేకపోతున్నారని నిలదీసింది. సినిమా హాల్స్, మల్టీ ఫ్లెక్సుల్లో ఇతర ఆహార పదార్థాలను అనుమతి ఇవ్వకపోవటం వల్ల.. ధరలు అధికంగా ఉంటున్నాయని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వ సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. వెంటనే ఇంటి నుంచి లేదా బయట నుంచి తెచ్చుకునే ఆహార పదార్థాలను అనుమతించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అదే విధంగా ధరలను భారీగా తగ్గించకపోతే ఆయా మల్టీఫ్లెక్సులపై చర్యలు కఠినంగా ఉంటాయని.. దీనిపై ఓ విధివిధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది కోర్టు. ఓ వైపు కోర్టు అక్షింతలు, మరో వైపు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమంతో ప్రభుత్వం దిగి వచ్చింది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి మహారాష్ట్ర మల్టీ ఫ్లెక్సుల్లోకి బయట ఫుడ్ అనుమతిస్తారు.

హైదరాబాద్ లో ఇటీవలే మల్టీఫ్లెక్సులు, మాల్స్ లో పార్కింగ్ ఛార్జీలు ఎత్తివేశారు.. ఇక బయట ఫుడ్ కూడా అనుమతిస్తే.. ధరల అరాచకానికి చెక్ పడుతోంది.

Posted in Uncategorized

Latest Updates