సంబురంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం మంగళవారం (జూలై-17) వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రులు. బోనాలు, ఒడిబియ్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు.

వందల ఏళ్ల చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. శివసత్తుల పూనకాలు.. బోనాలు.. ఒడిబియ్యం సమర్పించే భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆషాడ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరపడం ఆనవాయితీ. అమ్మవారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ వేడుకలో… హోంమంత్రి నాయిని, ముఖ్యమంత్రి సతీమణి శోభ కూడా పాల్గొన్నారు. మొక్కులు సమర్పించుకున్నారు. మంగళవారం ఉదయం 3గంటల నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.

అమ్మవారి కళ్యాణం చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు భక్తులు. భక్తుల రద్దీతో అర్థరాత్రి వరకు అమ్మవారి ఆలయం తెరచి ఉంచారు. బల్కంపేట అమ్మవారి దర్శనం ప్రతీ ఒక్కరూ చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు మంత్రులు. సాధారణ భక్తులతో పాటు.. బోనాలు, ఒడిబియ్యంతో వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే బోనాల పండుగకి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రులు .

మంగళవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి అంటున్నారు భక్తులు. దర్శనం ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చిందంటున్నారు. లక్షకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి వరకు దర్శనానికి అనుమతి ఇవ్వడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఎల్లమ్మ కళ్యాణంతో.. ఆలయ పరిసరాలు, బల్కంపేట్ రూట్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates