సంబురం వచ్చేసింది : బోనాలకు ముస్తాబైన ఆలయాలు

ఆషాడమాసం  గోల్కొండ  బోనాలకు  అంతా రెడీ  అయ్యింది. రేపటి (ఆదివారం,జూలై-15)  నుంచి  గోల్కొండ  జగదాంభిక  ఆలయంలో  బోనాలు జరగనున్నాయి. బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండ కోటలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. మొదటి రోజు సుమారు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు జగదాంబిక ఆలయ మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.  వందేళ్ళ  చరిత్ర గల  ఈ ఆలయంలోని  జగదాంభిక  అమ్మవారికి  బోనం సమర్పించిన  తర్వాతనే  మిగిలిన  అన్ని అలయాల్లో  బోనాల పండుగ  ప్రారంభం అవుతుంది. డప్పు దరువులు, హోరెత్తించే పాటల పరవళ్లు, పోతరాజు నృత్య ప్రదర్శనల నడుమ ఆదివారం(జూలై-15) ఉదయం గోల్కొండ బోనాల పండుగ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్‌ దగ్గర తొట్లె ఊరేగింపు మొదలవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసే స్వాగత వేదికపై రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరై అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, అధికార లాంఛనాలు, అలాగే సాక సమర్పిస్తారు. దీంతో అట్టహాసంగా వేడుకలు ప్రారంభమవుతాయి. భారీ ఊరేగింపుతో తొట్టెల ప్రదర్శన ముందుకు సాగుతుంది. 15వ తేదీ నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు ప్రతి ఆది, గురు వారాల్లో 9 ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 22వ తేదీ ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే  బడా బజార్  దగ్గర పూజారీ  ఇంట్లో  అమ్మవారి  బోనాలకు సంబంధించి  పూజలు మొదలయ్యాయి.

ఆదివారమే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం ప్రారంభమవుతుంది. ఈ నెల 29, 30 తేదీల్లో మహంకాళి బోనాలు, రంగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహంకాళి ఆలయాన్ని అందంగా అలంకరిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుండడంతో గ్రామాలు, పట్టణాల్లో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates