సజీవ సమాధికి యత్నం: అడ్డుకున్న పోలీసులు

ఆధ్యాత్మిక భావన కలిగిన ఓ వృద్ధుడు సజీవ సమాధి అయ్యేందుకు యత్నించగా పోలీసుల జోక్యంతో నిలిచిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని గన్నవరంలో జరిగింది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల తాతిరెడ్డి లచ్చిరెడ్డి వ్యవసాయదారుడు. ఆయన ఆధ్యాత్మికుడు కూడా. నిత్యం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు.  ఈ సమాజంపై తనకు విరక్తి పుట్టిందని …ఈ లోకంలో ఉండలేనని… సజీవ సమాధికిలో వెళ్లాలని దేవుడు తనను పిలుస్తున్నాడంటూ తన పొలంలో స్వయంగా సమాధి కట్టించుకున్నాడు. పది అడుగుల లోతులో దాన్ని నిర్మించి ఇనుప తలుపులు కూడా ఏర్పాటు చేయించాడు.

గురువారం(జూలై-26) మంచి రోజని, తనకు సమాధిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్‌కు, పోలీసు అధికారులను కోరాడు.ఈ విషయాన్ని ఊర్లో వారికి కూడా చెప్పాడు. దీనిలో భాగంగా గురువారం సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు. అయితే తాతిరెడ్డి లచ్చిరెడ్డిని సమాధిలోకి వెళ్లకుండా చూడాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. మాచర్ల రూరల్‌ సీఐ దిలీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ లోకేశ్వరరావు గ్రామానికి వెళ్లి లచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకొని సమాధిలోకి వెళ్లటం నేరమని కౌన్సెలింగ్‌ చేశారు. చట్టరీత్యా ఇలాంటి పనులు చేయకూడదంటూ నచ్చజెప్పారు. ఆధ్యాత్మికంలో మునిగిపోయిన లచ్చిరెడ్డి పదేళ్లుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates