సఫారీ గడ్డపై సంచలనం సృష్టించిన కోహ్లీసేన

South-Africa-vs-Indiaభారత జట్టు మళ్లీ అదరగొట్టింది… మూడో టెస్టు నుంచి మొదలైన జోరు ఇప్పుడు మూడో వన్డే వరకు కొనసాగింది. ముందుగా కోహ్లి వీరశతకం, ధావన్‌ దూకుడుతో చెలరేగిన భారత్‌. దక్షిణాఫ్రికా గడ్డపై గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా ఓటమి పాలైన భారత్‌ ఇప్పుడు ఆ గండాన్ని మాత్రం దిగ్విజయంగా దాటేసింది. హ్యాట్రిక్‌ విజయంతో ఇక వన్డే సిరీస్‌ కోల్పోయే అవకాశం లేని స్థితిలో నిలిచింది. బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్‌ 124 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కోహ్లి (159 బంతుల్లో 160 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగగా… శిఖర్‌ ధావన్‌ (63 బంతుల్లో 76; 12 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా కుల్దీప్‌ (4/23), చహల్‌ (4/46) మాయాజాలానికి 40 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. జేపీ డుమిని (67 బంతుల్లో 51; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. తాజా ఫలితంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్‌ 3–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో వన్డే శనివారం జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.

పోటీపడి పరుగులు తీసిన కోహ్లి, ధావన్ 

దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్‌ శర్మ వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. రబడ వేసిన తొలి ఓవర్లోనే రోహిత్‌ (0) కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో సున్నా వద్దే భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా… రివ్యూలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. ఆ తర్వాత ధావన్, కోహ్లి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. బలహీనంగా కనిపించిన సఫారీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు దూసుకుపోయారు. ఎక్కడా తడబాటు లేకుండా వీరిద్దరు స్వేచ్ఛగా ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ముఖ్యంగా తొలి వన్డే ఆడుతున్న ఇన్‌గిడి 4 ఓవర్ల మొదటి స్పెల్‌లో భారత్‌ 6 ఫోర్లతో 29 పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్‌ 10 ఫోర్లతో 50 పరుగులు చేసింది. ఈ జోరులో ధావన్‌ 42 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం 100 పరుగులు దాటిన తర్వాత 64 బంతుల్లో కోహ్లి కూడా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే డుమిని బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి ధావన్‌ వెనుదిరగడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. అనవసరపు షాట్‌కు ప్రయత్నించి రహానే (11) అవుట్‌ కాగా, పాండ్యా (14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో దక్షిణాఫ్రికా కొంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసింది. ఫలితంగా పరుగుల వేగం మందగించింది. ధోని (22 బంతుల్లో 10) పూర్తిగా నిరాశపర్చగా… జాదవ్‌ (1) తనకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. అయితే భువనేశ్వర్‌ (16 నాటౌట్‌) అండగా నిలవడంతో కోహ్లి మళ్లీ జట్టు ఇన్నింగ్స్‌ను సరైన దారిలో పెట్టాడు. కోహ్లి, భువీ ఏడో వికెట్‌కు అభేద్యంగా 67 పరుగులు జోడించడం విశేషం. చివరి ఐదు ఓవర్లలో 47 పరుగులు రాబట్టిన భారత్‌ 300 పరుగుల స్కోరును దాటింది.

స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) క్లాసెన్‌ (బి) రబాడ 0, ధవన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) డుమిని 76, కోహ్లీ (నాటౌట్‌) 160, రహానె (సి) ఫెహ్లుక్వాయో (బి) డుమిని 11, హార్దిక్‌ (సి) క్లాసెన్‌ (బి) మోరిస్‌ 14, ధోనీ (సి) ఎంగిడి (బి) తాహిర్‌ 10, కేదార్‌ (సి) క్లాసెన్‌ (బి) ఫెహ్లుక్వాయో 1, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 50 ఓవర్లలో 303/6; వికెట్ల పతనం: 1-0, 2-140, 3-160, 4-188, 5-228, 6-236; బౌలింగ్‌: రబాడ 10-1-54-1, ఎంగిడి 6-0-47-0, మోరిస్‌ 9-0-45-1, ఫెహ్లుక్వాయో 6-0-42-1, తాహిర్‌ 9-0-52-1, డుమిని 10-0-60-2.

సౌతాఫ్రికా: ఆమ్లా (ఎల్బీ) బుమ్రా 1, మార్‌క్రమ్‌ (స్టంప్డ్‌) ధోనీ (బి) కుల్దీప్‌ 32, డుమిని (ఎల్బీ) చాహల్‌ 51, క్లాసెన్‌ (ఎల్బీ) చాహల్‌ 6, మిల్లర్‌ (సి) ధోనీ (బి) బుమ్రా 25, జోండో (సి/సబ్‌) మనీష్‌ (బి) చాహల్‌ 17, మోరిస్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 14, ఫెహ్లుక్వాయో (సి) కోహ్లీ (బి) కుల్దీప్‌ 3, రబాడ (నాటౌట్‌) 12, తాహిర్‌ (సి) కోహ్లీ (బి) చాహల్‌ 8, ఎంగిడి (ఎల్బీ) కుల్దీప్‌ 6; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 40 ఓవర్లలో 179 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-1, 2-79, 3-88, 4-95, 5-129, 6-150, 7-150, 8-158, 9-167; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 7-0-41-0, బుమ్రా 7-0-32-2, హార్దిక్‌ 8-0-35-0, చాహల్‌ 9-0-46-4, కుల్దీప్‌ 9-1-23-4.

Posted in Uncategorized

Latest Updates