సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్…2400 కోట్లు వెచ్చించాం : మంత్రి పోచారం

రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలకు చెందిన 38 గ్రామాల కూరగాయాల రైతులు హాజరయ్యారు. హైదరాబాద్ నగరవాసుల డిమాండ్లకు అనుగుణంగా కూరగాయలు, ఆకుకూరల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై రైతులతో చర్చించారు మంత్రి.

ఎస్సీలకు పూర్తి సబ్సిడీతో, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నామన్నారు మంత్రి పోచారం. మన రైతుల ద్వారానే కూరగాయలు పండించాలనే ఉద్దేశంతోనే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. కూరగాయల ఉత్పత్తి పెరగాలనే ఉద్దేశంతో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు శ్రీనివాస్‌రెడ్డి. మూడున్నరేళ్లలోనే డ్రిప్ ఇరిగేషన్ కు రూ. 2,400 కోట్లు ఖర్చు చేశామన్నారు. కూరగాయల ఉత్పత్తి కోసం ఇబ్రహీంపట్నం క్రాప్ కాలనీ ఏర్పాటు చేశామన్నారు. రాష్ర్టంలో 1.20 కోట్ల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉందన్నారు. విద్యుత్ మోటార్ల ద్వారా దాదాపు 50 లక్షల ఎకరాలు సాగు అవుతుందన్నారు. మరో 50 లక్షల ఎకరాలు ప్రాజెక్టుల కింద సాగు అవుతుందని స్పష్టం చేశారు మంత్రి పోచారం.

Posted in Uncategorized

Latest Updates