సమస్యల నిలయాలుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు

సమస్యలకు నిలయాలుగా మారాయి రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు. పడుకునేందుకు గదులు లేవు. దొడ్డు అన్నం.. రుచిలేని కూరలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక బాలికల ఆశ్రమ పాఠశాలలు దిక్కు లేకుండా పోయాయి. చాలాచోట్ల ఇంచార్జీ ప్రిన్సిపల్స్ తో నెట్టుకొస్తున్నారు అధికారులు. వరంగల్ ITDA పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలపై వీ6 స్పెషల్ స్టోరీ.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 23 బాలికల, 33 బాలుర ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 38 ఉన్నత పాఠశాలల్లో 22 మంది పీజీ హెచ్ ఎంలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 23 మంది పీజీహెచ్ఎంల్లో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. నిబంధనల ప్రకారం బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల్లో మహిళా ప్రధానోపాధ్యాయులే పనిచేయాల్సి ఉన్నా… ఇంచార్జీలతో నడిపిస్తున్నారు. తప్పని సరైనప్పుడు మాత్రమే 50 సంవత్సరాలు దాటిన ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాలి.
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ప్రాజెక్ట్ నగర్ , గంగారం, కొత్తగూడ, ముత్యాలమ్మగూడెం, గూడూరు, మహబూబాబాద్ , కురవి, వర్ధన్నపేట, జులైవాడ ఆశ్రమపాఠశాలల్లో హెచ్ ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిరిజన పాఠశాలల్లో విద్యార్ధులకు పెట్టే భోజనంపై వార్డెన్ ల పర్యవేక్షణ లేక పోవటంతో ఇంచార్జ్ కుక్ లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
మహిళ ప్రధానోపాద్యాయులు లేక సమస్యలను సార్లకు చెప్పుకోలేక పోతున్నామని విద్యార్ధినులు వాపోతున్నారు. ఇబ్బందులు తొలగించాలని అధికారులను కోరుతున్నారు స్టూడెంట్స్.
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కనీసం 300 నుంచి 500 మంది వరకు విద్యార్థులుంటారు. ఇరుకైన గదుల్లో కూర్చుని పాఠాలు వినాల్సి వస్తుందని విద్యార్థులు చెప్పారు. దొడ్డుబియ్యంతో అన్నం పెడుతున్నారని విద్యార్ధులు వాపో తున్నారు.
ఎజెన్సీలో ఆదివాసీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో భవనాల కొరత తీర్చాలని, పూర్తి స్థాయి హెచ్ఎంలను నియమించాలని గిరిజన విద్యార్ధులు కోరుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates