సరికొత్త డిజైన్లు రావాలి : గవర్నర్

GOVERNERపోచంపల్లికి చేనేతల బ్రాండ్ ఇమేజీని ఇంకా పెంచాలన్నారు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్. మారుతున్న కాలానికి అనుగుణంగా నేత కార్మికులు ఆకర్షణీయమైన సరికొత్త వస్ర్తాల డిజైన్లు రూపొందించాలని చెప్పారు ఆయన. చేనేత కార్మికులు అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేసేవిధంగా వృత్తిలో రాణించాలన్నారు గవర్నర్. బుధవారం గవర్నర్ కుటుంబసభ్యులతో కలిసి పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటించి నేత కార్మికుల కష్టసుఖాలను తెలుసుకున్నారు. పోచంపల్లి గ్రామీణ టూరిజం పార్కులో చేనేత స్వయం సహాయక మహిళాసంఘాలు, బ్యాంకర్లు, మాస్టర్ వీవర్లు, సొసైటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ముద్ర రుణాలు అందించాలి

నేత కుటుంబాలవారందరితో జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించి వారికి విరివిగా ముద్ర రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు గవర్నర్ నరసింహన్. శ్రీరామనందతీర్థసంస్థకు చేరుకుని అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థుల నైపుణ్యాన్ని పరిశీలించారు. సంస్థ ప్రాంగణంలో గవర్నర్ దంపతులు మొక్కలు నాటారు. గవర్నర్ దంపతులు ముందుగా కనుముక్కులలోని మెగా చేనేత క్లస్టర్‌ను కూడా సందర్శించి అక్కడ నేత వస్ర్తాలు కొనుగోలు చేశారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రవినాయక్ తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.

పోచంపల్లిలో నేత కార్మికుడి ఇంటికి వెళ్ళిన గవర్నర్..

ఈ పర్యటనలో భాగంగా పోచంపల్లిలోని చేనేత కార్మికుడు గొట్టిముక్కల ఇస్తారి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ జీవన స్థితిగతులను స్వయంగా తెలుసుకున్నారు గవర్నర్ నరసింహన్. ఆ కుటుంటానికి ఎంత ఆదాయం వస్తున్నది, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నదీవి అని అడిగారు. తరువాత గవర్నర్ దంపతులు చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో మోడల్ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఆహార పదార్ధాలను స్వయంగా రుచి చూశారు. అనంతరం చౌటుప్పల్ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.

Posted in Uncategorized

Latest Updates