ప్రభుత్వ అధికారులందరికీ స్మార్ట్ ఫోన్లు

smartphone-telanganaతెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులకు గుడ్ న్యూస్ అందించింది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులందరికీ స్మార్ట్ ఫోన్లు అందివ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. మారుతున్న టెక్నాలజీని అందరూ వినియోగించుకుంటూ.. అధికారులందరూ సమన్వయంతో సమర్థంగా, జవాబుదారితనంతో పనిచేయడం కోసం మొబైల్ డివైజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరికీ స్మార్ట్‌ఫోన్లను అందిస్తారు. IAS అధికారులకు రూ.60 వేలు, సెకండరీగ్రేడ్ అధికారులకు రూ.25 వేలు, తర్వాతి స్థాయి అధికారులకు రూ.20 వేల విలువచేసే ఫోన్లను కొనుగోలుచేయాలని సర్కారు ఆదేశించింది. ఏ స్థాయి అధికారులకు ఫోన్లు ఇవ్వాలనేది ఆయా శాఖల ప్రధాన కార్యాలయ అధిపతులు నిర్ణయిస్తారు.

దీనికి సంబంధించి ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్  ఉత్తర్వులు  జారీచేశారు. ప్రతిస్మార్ట్ ఫోన్‌ ను మొబైల్ డివైజ్ సిస్టమ్‌ తో అనుసంధానంచేస్తారు. దీనివల్ల ప్రతి అధికారి GPRS ద్వారా మిగతా అధికారులతో లింక్ అయి ఉంటారు. అధికారులందరికీ ఒకే CUC గ్రూప్ ఉంటుంది. ఈ వ్యవస్థతో లింక్ అయిన ఫోన్ స్తంభించదు. ఇప్పటికే రెవెన్యూశాఖలోని VRO, VRA లకు ట్యాబ్‌ లు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి దానికి సంబంధించిన ఫొటోలను అక్కడినుంచే అప్‌ లోడ్ చేస్తున్నారు. క్రాప్ కటింగ్ లెక్కలు కూడా పక్కాగా సేకరించారు. ఏ భూమిలో ఏ పంట పండించారన్నదానిపై కూడా స్పష్టత వచ్చింది. క్షేత్రస్థాయి పనివిధానంలో సమర్థత, పారదర్శకత పెరిగింది.

క్షేత్రస్థాయిలో ఉండే అధికారులకు నేరుగా CCLA  అధికారులతో సంబంధాలు పెరిగాయి. ఈ విధానం విజయవంతం కావడంతో మిగతా శాఖల్లో కూడా అందరు అధికారులకు ఈ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు వెంటనే క్షేత్రస్తాయికి చేరుతాయి. అదేసమయంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల ఫలితాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు చేరుతాయి. GPRS ట్రాకింగ్ వ్యవస్థ వల్ల ఏ అధికారి క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుస్తుంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులను పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది.

Posted in Uncategorized

Latest Updates