సర్కార్ సవాల్ : బీసీ రిజర్వేషన్లపై రివ్యూ పిటీషన్

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయనున్నట్లు ప్రకటించింది కేబినెట్ సబ్ కమిటీ. పంచాయితీ రాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50శాతం దాటొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులోఅప్పీల్ చేయాలని నిర్ణయించింది సబ్ కమిటీ.  పంచాయితీ రాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోర్టుకు చెప్పనుంది ప్రభుత్వం. దీని కోసం అవసరమైన కసరత్తు చేసి.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలనే నిర్ణయానికి వచ్చింది. 50శాతానికి రిజర్వేషన్లు దాటకూడదన్న ఉత్తర్వులు.. విద్య, ఉద్యోగాలకు సంబంధించిన అంశం అన్నారు మంత్రి ఈటెల రాజేందర్. రాజకీయ పరంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు.

రాజ్యంగ బద్దంగా ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉందని.. వెనకబడిన వర్గాలకు లేవన్నారు. అయినా దేశంలో ఆయా రాష్ట్రాల్లోని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసుకుంటున్నాయి అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో 69శాతం రిజర్వేషన్లు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 34శాతం రిజర్వేషన్లు సాధించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం అన్నారు. సుప్రీంకోర్టులో విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఈటెల. ఇప్పటికే ఓసారి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం అని.. ఆ తీర్మానంపైనే రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates