సర్వే రిపోర్ట్ : సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు

MBసెల్ ఫోన్ ప్రాణాలు తీస్తోంది. సెల్ ను వాడటంలో నిర్లక్ష్యం చేస్తే  ప్రాణాలకు ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ ప్రమాదాలపై జరిపిన సర్వేలో  సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు సర్వేలో తేలింది.

చిన్నా, పెద్దా అందరి దగ్గర సెల్ ఫోన్ ఉండటం ఈ రోజుల్లో కామన్ గా మారిపోయింది. ఇంట్లో ఉన్నా, బయటకు వచ్చినా చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. సెల్ తో పాటు చేతిలో బైక్ ఉంటే.. యువత జోరే వేరు. సెల్ లో పాటలు, చేతిలో బైక్ తో రయ్ రయ్ మంటూ దూసుకెళ్తారు.  అయితే ఈ రెండిటీ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు నిస్సాన్ గ్రూప్ ఆఫ్ ఇండియా సర్వే రిపోర్టు తేల్సింది.

దేశంలోని 20 రాష్ట్రాలలో 2199 మంది ఫోర్ వీలర్స్ పై నిస్సాన్ గ్రూప్ ఆఫ్ ఇండియా సంస్థ  సర్వే చేసింది.  రాష్ట్రంలో కారులు నడిపే 132 మందిని సర్వే చేసింది  ఆ సంస్థ. అధిక వేగం.. సెల్ ఫోన్ డ్రైవింగ్,  ట్రాఫిక్ నిబంధనలు.. పోలీసు నిఘాపై వాహనదారులు వ్యవహరిస్తున్న తీరును  పరిగణలోకి తీసుకుని అధ్యయనం జరిపింది. రాష్ట్రంలో 42 శాతం మంది వెహికిల్స్ ను .. పరిమితికి మించిన వేగంతో నడుపుతున్నట్లు తేలింది. 62 శాతం మంది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటే.. ఇందులో 34 శాతం మంది పోలీసులకు పట్టుబడినట్లు సర్వేలో బయటపడింది.

సర్వే రిపోర్టు ప్రకారం … దేశంలో వెహికిల్ నడిపే ప్రతి ఐదుగురిలో ముగ్గురు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.  ప్రతి నలుగురిలో ఒకరు పోలీసుల చెకింగ్ లో పట్టుబడుతున్నారు. ఇంటి నుంచి బైక్ పై బయటకు వెళ్లిన పిల్లలు తిరిగి వచ్చే వరకు టెన్షన్ గా ఉంటుందంటున్నారు పేరేంట్స్.   సెల్ ఫోన్ డ్రైవింగ్ తో జరిగే ప్రమాదాలపై  విద్యార్థులకు అవగహన కల్పించాలంటున్నారు మానసిక నిపుణులు.

నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తే,  కోర్టులో రెండు వేల వరకు జరిమానాతో పాటు జైలు శిక్షలు పడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. పిల్లలు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడవద్దని పేరేంట్స్ చెప్పాలంటున్నారు. ఒక వేళ సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టుబడితే భవిష్యత్ లో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు విదేశాలకు వెళ్లాలంటే కూడా కష్టమే అంటున్నారు. ప్రజలకు అవగహన కల్పించడం ద్వారానే సెల్ ఫోన్ డ్రైవింగ్  ప్రమాదాలను నివారించవచ్చంటున్నారు నిపుణులు.

 

Posted in Uncategorized

Latest Updates