సాంస్కృతిక సమాఖ్య నియామకాలు చెల్లవు : హైకోర్టు

తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యలో  నియామకాలు పారదర్శకంగా లేవని వెల్లడించింది హైకోర్టు. ఎటువంటి నోటిఫికేషన్‌ జారీ చేయకుండా.. దరఖాస్తు కూడా చేసుకోకుండానే సాంస్కృతిక సారథులుగా 550 మంది కళాకారులను తెలంగాణ ప్రభుత్వం నేరుగా నియమించడాన్ని తప్పుబట్టింది హైకోర్టు. ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, దరఖాస్తులు తీసుకోకుండా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 550 మంది కళాకారులను నియమించారని, వారి నియామకాలను రద్దు చేయాలంటూ.. యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూర్‌ కు చెందిన జె.రమేశ్‌ తోపాటు మరో ఇద్దరు పిటిషన్ ను దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. దీంతో నోటిఫికేషన్‌ ఇచ్చి.. అర్హులను గుర్తించి.. వారినే నియమించాల్సి ఉన్నా.. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని తెలిపిన హైకోర్టు..  ఈ తరహా నియామకాలతో అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. సాంస్కృతిక సారథుల నియామకానికి మూడు వారాల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వాన్ని మంగళవారం (జూలై-10) ఆదేశించింది హైకోర్టు. అయితే కోర్టు తీర్పుతో ఆందోళన చెందాల్సిన పని లేదని, కళాకారుల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని తెలిపారు సాంస్కృతిక సారథి చైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌.  తీర్పును కూలంకషంగా పరిశీలించి, సలహా మండలి సభ్యులతో చర్చిస్తామని తెలిపారు.

 

 

Posted in Uncategorized

Latest Updates