సాకర్ సమరం : అర్జెంటీనాకు షాక్..క్వార్టర్స్‌ కు ఫ్రాన్స్

FIFAసూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ నుంచి రష్యా ప్రపంచకప్‌లో అభిమానులు ఆశించిన మెరుపులు కనిపించలేదు. అతి కష్టం మీద నాకౌట్‌కు అర్హత సాధించిన అర్జెంటీనా ప్రి క్వార్టర్స్ సమరంలో తేలిపోయింది. ప్రాణం పెట్టి పోరాడాల్సిన మ్యాచ్‌లో వరల్డ్ స్టార్ చేతులెత్తేశాడు. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఫ్రాన్స్ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దంలా ప్రత్యర్థిపై సునాయాసంగా ఆధిక్యం సంపాదించింది.

శనివారం (జూలై-30) జరిగిన తొలి నాకౌట్ మ్యాచ్‌ లో అగ్రశ్రేణి జట్టు అర్జెంటీనాపై 4-3 గోల్స్‌తో ఫ్రాన్స్ విజయం సాధించింది. యువ ఆటగాడు కిలియన్ ఎంబప్పే సంచలన ప్రదర్శనతో ఫ్రాన్స్‌కు రెండు గోల్స్ అందించాడు. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించిన కిలియన్ హీరోగా నిలిచాడు. రెండు గోల్స్ సాధించడం మాత్రమే కాదు ఆ జట్టుకు ఒక పెనాల్టీ వచ్చేలా వ్యూహాత్మకంగా ఆడాడు.

ఆరంభం నుంచి అర్జెంటీనా పేలవ డిఫెన్స్‌తో ఫ్రాన్స్ అలవోకగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్ వైపు దూసుకెళ్లింది. గోల్ కొట్టేందుకు ఫ్రాన్స్ ప్రయత్నించిన ప్రతిసారీ దాన్ని అడ్డుకోవడంలో అర్జెంటీనా ఘోరంగా విఫలమైంది. ఫ్రాన్స్ ఆటగాళ్లు చాలా సంయమనంతో మ్యాచ్ ఆడారు. సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మైదానంలో ఉన్నా లేనట్లే అనిపించింది. ముందుండి ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాల్సింది పోయి ఫ్రాన్స్ గోల్ చేసినప్పుడల్లా నిరుత్సాహానికి గురయ్యాడు. ఆఖర్లో ఒకసారి మాత్రమే గోల్‌కొట్టేందుకు ప్రయత్నించగా దాన్ని ఫ్రాన్స్ గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. అర్జెంటీనా ఎక్కువగా మెస్సీపైనే ఆధారపడింది. అర్జెంటీనా డిఫెన్స్ విభాగంలో లోపాలతో కీలక మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకుంది.

అంతకుముందు 2016 యూరో కప్ హీరో ఆంటోనియో గ్రిజ్‌మన్ 13వ నిమిషంలో స్పాట్ కిక్‌తో ఫ్రాన్స్ గోల్ ఖాతా తెరిచాడు. 41వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ డిగో మారియా తొలి గోల్ చేసి స్కోరు 1-1తో సమం చేశాడు. ప్రథమార్థంలో ఇరు జట్లు మరో గోల్ చేయకపోవడంతో 1-1తో ముగిసింది.

రెండో సెషన్‌లో రసవత్తర పోరు సాగింది. 48వ నిమిషంలో మెర్కాడో.. మెస్సీ అందించిన పాస్‌ను నేరుగా గోల్‌పోస్ట్‌ లోకి పంపాడు. దీంతో అర్జెంటీనా అధిక్యం 2-1కు చేరింది. ఎంబప్పే 64వ, 68వ నిమిషంలో సంచలన గోల్స్ చేసి ఆధిక్యాన్ని 4-2కు పెంచాడు. ఆఖరి ఇంజురీ సమయంలో (90+ 2) సెర్గియో అగురో అర్జెంటీనాకు మరో గోల్ అందించాడు. సమయం ముగిసిపోవడంతో మెస్సీసేన నిరాశతోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మరోపక్క ఫ్రాన్స్ ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

Posted in Uncategorized

Latest Updates