సాకర్ సమరం : నేటి నుంచి ఫుట్‌ బాల్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌

FIFAవరల్డ్‌ కప్ లో హాట్‌ ఫేవరెట్ల మధ్య జరిగే ఫైనల్‌ కాని ఫైనల్‌.. ఫ్యాన్స్‌ కు మస్తు ఫుట్‌ బాల్‌ కిక్కును అందించనుంది. శుక్రవారం (జూలై-6) జరిగే హైవోల్టేజ్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌ లో ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌ తో బెల్జియం తలపడనుంది.

ఆరో ప్రపంచకప్‌ పై బ్రెజిల్‌ గురిపెడితే.. మాజీ చాంపియన్‌ కు చెక్‌ చెప్పి పునర్‌ వైభవాన్ని తీసుకురావాలని బెల్జియం పట్టుదలతో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తున్న ప్రపంచ నెం:2 బ్రెజిల్‌, అటాకింగ్‌ గేమ్‌ తో ప్రత్యర్థులను వణికిస్తున్న మూడో ర్యాంకర్‌ బెల్జియం మధ్య మ్యాచ్‌ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రెజిల్‌ టీమ్‌ మ్యాచ్‌ మ్యాచ్‌ కూ పదును తేలుతోంది. నేమార్‌ ఫామ్‌ లోకి రావడం ఆ టీమ్‌ కు కొండంత బలం. ప్రీ క్వార్టర్స్‌ లో మెక్సికోపై మెరిసిన నేమార్‌ గోల్‌ చేయడంతోపాటు మరో గోల్‌ కు బాటలు వేశాడు. థియాగో, మిరాండాలతో బ్రెజిల్‌ రక్షణ శ్రేణి ఎంతో బలంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థులైన మిడ్‌ ఫీల్డర్లు ఉన్న జట్టు కూడా బ్రెజిలే.

ఇక స్ట్రయికర్‌ నేమార్‌, కౌటినో, ఫిర్మినోలతో అటాకింగ్‌ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లుపరిగెత్తిస్తోంది. సాంబా జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించడం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు బెల్జియం కోచ్‌ రాబర్టో మార్టినెజ్‌ ప్రకటించాడు. ప్రీ క్వార్టర్స్‌ లో జపాన్‌ తో మ్యాచ్‌ లో 0-2తో వెనుకబడినా.. పుంజుకుని మ్యాచ్‌ లో విజయం సాధించడం ఆ జట్టు విశ్వాసాన్ని పెంచింది. రొమేలు లుకాకు, మ్యూనియర్‌, ఈడెన్‌ హజార్డ్‌, కెవిన్‌ డిబ్రుయెన్‌ ఫామ్‌ లో ఉండడం కలిసొచ్చే అంశం. ఈ మ్యాచ్‌ లో వీరి నుంచి టీమ్‌ మరోసారి అదేతరహా ప్రదర్శనను ఆశిస్తోంది. అటాకింగ్‌ విషయంలో రెడ్‌ డెవిల్స్‌ తిరుగులేని ఆటను ప్రదర్శిస్తున్నా.. డిఫెన్స్‌ లోపాలు జట్టును ఆందోళనకు గురిచేస్తున్నాయి. పసికూన జపాన్‌ కు 2 గోల్స్‌ చేసే అవకాశం కల్పించడం డిఫెన్స్‌ బలహీనతలను బయటపెట్టింది. వీటిని అధిగమించి రెడ్‌ డెవిల్స్‌ గర్జిస్తుందా.. బ్రెజిల్‌ సెమీస్ కు చేరుతుందా అనేది చూడాలి.

Posted in Uncategorized

Latest Updates