సాకర్ హీరో : హైదరాబాద్ కంటే చిన్న దేశం.. ప్రపంచాన్నే నివ్వెరపరిచింది

ఫుట్ బాల్ ప్రపంచ కప్ చరిత్ర సృష్టించింది. ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచినా.. ఇప్పుడు అందరి నోట ఎవరీ క్రొయేషియా.. ఏమా దేశం.. ఎక్కడ ఉంది.. ఆ దేశం ఏం చేస్తోంది.. అనేదానిపై ఆసక్తి నెలకొంది. క్రోయేషియా దేశం గురించి తెలుసుకుంటే మాత్రం ఔరా అని ముక్కున వేలేసుకుంటారు. అవును ఆ దేశ జనాభా ఎంతో తెలుసా అక్షరాల 41 లక్షల మంది.. అవును హైదరాబాద్ లో సగం మంది కూడా లేరు ఆ దేశ జనాభా. ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫైనల్ వరకు వచ్చింది. అంచనాలు లేకుండా రష్యాలోకి ఎంటర్ అయిన ఈ జట్టు.. లీగ్ దశలోనే వెనక్కి వెళ్లటం ఖాయం అనుకున్నారు అంతా.. ఎవరూ ఊహించని విధంగా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఫ్రాన్స్ నే ముచ్చేమటలు పట్టించింది.

1950 తర్వాత ఫైనల్ చేరిన అతి చిన్న దేశంగా రికార్డ్ సృష్టించింది క్రొయేషియా. భారతదేశం జనాభాతో పోల్చితే 300 రెట్లు ఎక్కువ. మన దేశంలోని అన్ని నగరాల్లోని జనాభాతో పోల్చినా.. క్రొయేషియా దేశ ప్రజల సంఖ్య చాలా తక్కువ. అలాంటి దేశం ఆరు కోట్ల జనాభా ఉన్న ఫ్రాన్స్ తో తలపడి.. సత్తా చాటింది. ఫైనల్స్ లో ఓడినా.. ప్రపంచం మొత్తం క్రొయేషియాను కీర్తిస్తూనే ఉంది. వారి పోరాట స్ఫూర్తి, ఫుట్ బాల్ పై ఆ దేశ ప్రజలకు ఉన్న మమకారం ఏంటో చెబుతోంది. ఆ దేశ అధ్యక్షురాలు సైతం ఓ సామాన్య అభిమానురాలిగా మారిపోయి అల్లరి చేశారంటే.. ఆ దేశం ఇంకెంత ఉప్పొంగిపోయిందో. ఫైనల్ ముగిసిన తర్వాత ఆ దేశ అధ్యక్షురాలు కోలిందా గ్రాబర్ కిటరోవిచ్ వ్యవహరించిన తీరు కూడా ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకుంది. బాధలో.. కన్నీళ్లు పెట్టుకున్న ఆటగాళ్లను స్వయంగా ఓదార్చారు. ఆటగాళ్ల కన్నీళ్లు తుడిచారు. వర్షం పడుతున్నా.. కనీసం గొడుగు కూడా లేకుండా అలాగే నిలుచున్నారు. ఈమె దేశానికి అధ్యక్షురాలేనా అనే ఆశ్చర్యం అందరిలో కలిగింది.

పెద్ద దేశాలు.. ఈ సమరం కోసం వందల కోట్లు ఖర్చు చేశాయి. కోచ్ లు, వ్యూహాల పేరుతో డబ్బును నీళ్లలా ఖర్చు చేశాయి. ప్రత్యేక విమానాల్లో వచ్చాయి జట్లు. కానీ క్రొయేషియా జట్టు మాత్రం అతి సాధారణంగా.. మిగతా ప్రయాణికులతో కలిసి రష్యాలోకి ఎంట్రీ ఇచ్చాయి. మిగతా జట్లలా ఆర్భాటాలు, హంగామా ఏమీ లేవు. కేవలం ఆటపైనే దృష్టి పెట్టారు. రెండేళ్లుగా చేసిన కసరత్తు.. దేశానికి ఫుట్ బాల్ కప్ అందించాలనే కసి మాత్రమే వారిలో ఉన్నాయి. లీగ్ దశలో అద్భుతంగా ఆడినా.. క్వార్టర్స్, సెమీఫైనల్స్ ఓటమి తప్పుదు.. భంగపాటు తప్పదు అని అందరూ అనుకున్నారు. వారి ఊహలకు అందని విధంగా.. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది. అప్పుడే ఫైనల్ గెలిచినంత సంబురం క్రొయేషియా చేసుకుంది. కేవలం 41 లక్షల మంది ప్రజలు మాత్రమే ఉన్న క్రొయేషనియా దేశం సాకర్ ఫైనల్ కు చేరితే.. మన దేశం కనీసం అర్హత కూడా సాధించలేదు. ఫుట్ బాల్ అంటేనే చిన్నచూపు ఎందుకో..

Posted in Uncategorized

Latest Updates