సాగర్ పార్క్ లో ఘనంగా కాకా జయంతి.. కేటీఆర్, హరీష్ నివాళులు

ట్యాంక్ బండ్: హైదరాబాద్ లోని సాగర్ పార్క్ లో దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా కాకా విగ్రహానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా… ఎంపీ కె.కేశవరావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నేతలు, అభిమానులు నివాళులు అర్పించారు. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి,  వినోద్, విశాక ఇండస్ట్రీస్ జేఎండీ వంశీ సహా కాకా కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కేంద్ర జౌళి, కార్మిక, గ్రామీణాభివృద్ధి మంత్రిగా కాకా పేద వర్గాల కోసం విశేషమైన కృషిచేశారని అన్నారు. తెలంగాణ కోసం బుల్లెట్ దెబ్బలు తిన్నారని గుర్తుచేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో వెంకటస్వామి పోరాడారని చెప్పారు. గతంలో TRS, కాంగ్రెస్ పొత్తు విషయంలోనూ కాకా కీలకంగా వ్యవహరించారన్నారు. పేద ప్రజల ఆశయాలను… కాకా కుమారులు వినోద్, వివేక్ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు కేటీఆర్.

తెలంగాణ రాష్ట్ర సాధనలో, తొలి-మలి దశ ఉద్యమాల్లో జి.వెంకటస్వామి పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పారు మంత్రి హరీష్ రావు. పేదల ప్రజల గుండెల్లో కాకా నిలిచిపోయారని చెప్పారు. కాకా అజాత శత్రువనీ… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే బలమైన కోరిక ఆయనలో ఉండేదన్నారు. తెలంగాణకోసం పోరాడి.. స్వరాష్ట్రాన్ని చూసిన ఘనత ఆయనదని చెప్పారు. సికింద్రాబాద్ లో కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు వెంకటస్వామి గొంగడి కప్పుకుని వచ్చినట్టుగా తనకు చెప్పారని గుర్తుచేసుకున్నారు హరీష్ రావు. గోదావరి నీళ్లను మళ్లించాలన్న వెంకటస్వామి ఆశయాన్ని సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుతో నెరవేరుస్తున్నారని చెప్పారు హరీష్. కాకా జయంతి రోజునే వెలుగు దినపత్రికను తీసుకురావడం శుభ పరిణామం అన్నారు.

బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కాకా తన జీవితాన్ని అంకితం చేశారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి  చెప్పారు. కాకా జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమన్నారు. కార్మిక పక్షపాతి కాకా… ఎంతో మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించారని… తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని రాజకీయ పార్టీలను కలిపే ప్రయత్నం చేశారని అన్నారు బండారు దత్తాత్రేయ.

తాము ఈ స్థాయిలో ఉండడానికి కారణం తండ్రి వెంకట స్వామే అని చెప్పారు మాజీ మంత్రి, కాకా కుమారుడు వినోద్. కాకా పెట్టిన పెన్షన్ స్కీమ్ దాదాపు ఐదుకోట్ల మందికి ఉపయోగ పడిందన్నారు. ఎన్నో సమస్యలతో తన దగ్గరకొచ్చే ప్రజలకు చిరునవ్వుతో కాకా సమాధానం ఇచ్చేవారని గుర్తుచేసుకున్నారు.

తెలంగాణ విషయంలో పట్టుదల చూపిన తమ తండ్రి వెంకటస్వామి..  సీడబ్ల్యూసీ మీటింగ్ ను వాకౌట్ చేసిన విషయం గుర్తుచేసుకున్నారు ఆయన కుమారుడు వివేకానంద్. సీడబ్ల్యూసీలో కొట్లాడి తెలంగాణపై నిర్ణయం తీసుకొచ్చేలా ఒత్తిడి చేశారన్నారు. పేదవారికి ఏదైనా చేయాలన్న ఆయన సూచనతోనే విశాక చారిటబుల్ ట్రస్ట్ పేరిట సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ వస్తుందన్న నమ్మకంతోనే ఎప్పుడూ ఉండేవారని…. తెలంగాణ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేవారన్నారు. రామగుండంలో.. 44 డిగ్రీల టెంపరేచర్ లోనూ వెంకటస్వామి షేర్వాణి వేసుకునేవారని… ఆ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తాము కూడా షేర్వాణీ ధరిస్తున్నట్టు చెప్పారు వివేక్.

 

 

 

Posted in Uncategorized

Latest Updates