సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రా.. జైపాల్ కు హరీష్ రావ్ సవాల్

హైదరాబాద్ : టీఆర్ఎస్ పై విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. జైపాల్ రెడ్డి మాటలు చూస్తుంటే పచ్చకామెర్ల వాడికి లోకం పచ్చగానే కనిపిస్తున్నట్టుంది అన్నారు. కాంగ్రెస్ పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకు పోయిందన్నారు. జైపాల్ ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ ఎంత మాట్లాడితే టీఆర్ఎస్ కు అంత లాభం అన్నారు హరీష్ రావు. “మిషన్ భగీరథ కింద ఒక ఇంటికి కూడా నీరివ్వలేదని జైపాల్ మాట్లాడటాన్ని చూసి.. చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదని మరో అబద్దం మాట్లాడారు. మహబూబ్ నగర్ లోనే ఎనిమిది లక్షల ఎకరాలకు నీరిచ్చాం. మొత్తం నాలుగేళ్లలో 25 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఇచ్చింది ఐదు లక్షల ఎకరాలకు మాత్రమే” అన్నారు.

“కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ హయాంలో కేవలం తొమ్మిది కంపెనీలను నవరత్న కింద ఎంపిక చేసి వాటినే టెండర్లలో పాల్గొనేలా చేసింది నిజం కాదా ? ఆ నవరత్న కంపెనీల్లో తెలంగాణ కంపెనీ ఒక్కటి కూడా ఎందుకు లేదు? జైపాల్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు లక్షా యాభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తే.. అందులో తెలంగాణ, తెలుగు వారు ఎవరయినా ఉన్నారా” అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా ఆన్ లైన్ కాంట్రాక్టులు ఇస్తోందని అన్నారు.

జైపాల్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్దమని.. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తా అని అన్నారు హరీష్ రావు. సాగునీటి ప్రాజెక్టుల టెండర్లు, సాగునీటి సరఫరా పై చర్చిద్దాం రండ అన్నారు. చర్చకు రాకపోతే జైపాల్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు హరీష్.

Posted in Uncategorized

Latest Updates