సాయంత్రం ఆరు గంటలకే బార్లు మూసివేస్తాం: బీజేపీ

తెలంగాణలో అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో ఖరారు చేసింది. ఎన్నికల ప్రణాళికలో ఓటర్లపై వరాల జల్లు కురిపించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ప్రకటించారు. సాయంత్రం ఆరు గంటలకల్లా లిక్కర్ అమ్మకాలు నిలిపివేయాలని..బార్లు కూడా సాయంత్రం ఆరు గంటలకు మూసివేయాలన్నారు. మద్యం మహమ్మారి ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తోందని.. అందుకే మద్యపాన నియంత్రణ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రం అదనంగా విధిస్తున్న వ్యాట్‌ను తొలగిస్తామన్నారు ఆ పార్టీ నేతలు. వక్ఫ్‌, ఎండోమెంట్‌, క్రైస్తవ దేవాలయాల భూమల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు పూర్తిస్థాయి శిక్షణను ప్రభుత్వమే అందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పారిశుద్ధ విభాగాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా నియమిస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని కులాల్లో ఉన్న పేదలకు నిధులు చేరేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు ప్రభాకర్‌.

Posted in Uncategorized

Latest Updates