సింగపూర్ కౌంట్ డౌన్ : ట్రంప్ – కిమ్ భేటీతో హైఓల్టేజ్

kim-trumpఉత్తరకొరియా అధినేత కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శిఖరాగ్ర చర్చల కోసం సింగపూర్‌కు చెందిన సెంటోసా ద్వీపంలోని కాపెల్లా హోటల్ ముస్తాబవుతున్నది. మంగళవారం ఉదయం 9 గంటల (భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటల)కు వారి శిఖరాగ్ర భేటీ ప్రారంభం కానున్నది. కిమ్, ట్రంప్ మధ్య జరుగనున్న సమావేశం విజయవంతం కావాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. మరోవైపు రెండు దేశాల అధినేతలు బస చేసిన హోటళ్ల దగ్గర సింగపూర్ ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. ఇటు ఉత్తరకొరియా, అటు అమెరికాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న సింగపూర్ ఈ సదస్సు నిర్వహణకు రెండు కోట్ల సింగపూర్ డాలర్లను ఖర్చు చేస్తున్నది. ఇందులో సగం నిధులు రెండు దేశాల అధినేతల భద్రత కోసమే ఖర్చు చేస్తున్నట్లు సింగపూర్ ప్రధాని లీ తెలిపారు. ఈ శిఖరాగ్ర సదస్సు ఖర్చు భరించేందుకు తాము సిద్ధమేనని ఆయన చెప్పారు.

మంగళవారం… కిమ్‌తో సమావేశమయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం(జూన్-10) సాయంత్రం కెనడా నుంచి సింగపూర్‌కు చేరుకున్నారు. అంతకుముందే ఉత్తరకొరియా రాజధాని ప్యాం గ్యాంగ్ నుంచి ఎయిర్‌చైనా విమానంలో సింగపూర్‌కు చేరుకున్న కిమ్‌కు ఘన స్వాగతం లభించింది. ట్రంప్, కిమ్‌లకు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ స్వాగతం పలికారు. పటిష్ట భద్రత మధ్య కిమ్‌ను ఆయన బస చేసే సెయింట్‌రెగిస్ హోటల్‌కు తీసుకువెళ్లారు. ప్రపంచ శాంతి కోసం కిమ్‌తో భేటీకి వెళుతున్న తాను సానుకూలంగా ఉన్నట్లు ట్రంప్ చెప్పారు.

2011లో తండ్రి మరణం తర్వాత దేశ అధినేతగా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట కిమ్ రెండుసార్లు చైనాకు, ఒకసారి దక్షిణ కొరియా సరిహద్దుల్లో పర్యటించారు. ట్రంప్‌తో శిఖరాగ్ర సదస్సు జరుగనున్న క్రమంలో రెండుసార్లు చైనాకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోనూ, రెండుసార్లు దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌తోనూ కిమ్ సమావేశమయ్యారు. ఫిబ్రవరిలో దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్.. ట్రంప్, కిమ్ చర్చలకు బాటలు వేశాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్వయంగా కిమ్, ట్రంప్ మధ్య చర్చల కోసం వారితో సంప్రదింపులు జరిపారు. శిఖరాగ్ర చర్చల పట్ల తమ నిజాయితీని తెలిపేందుకు ఉత్తర కొరియా ఒక అణ్వస్త్ర కేంద్రాన్ని పేల్చివేసింది. ఇద్దరు అమెరికా ఖైదీలను విడిచిపెట్టింది.

Posted in Uncategorized

Latest Updates