సింగరేణికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: సీఎం కేసీఆర్

kcr
గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 646 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. గనుల్లో మౌళిక వసతుల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మిక సంఘ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని…ఇప్పటికే 15 హామీల అమలు జరుగుతోందన్నారు. బొగ్గు గనుల, తరలింపు ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం కోసం పత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

సింగరేణి ప్రాతంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మంగళవారం (ఏప్రిల్-10) అధికారులతో సమీక్ష చేపట్టారు. సింగరేణి ఏరియాల్లో బొగ్గు తీయడం ద్వారా సమకూరిన ఆదాయం నుంచి.. డిస్ట్రిక్ట్ మినిరల్ ఫండ్ ట్రస్టు నిధులతో పాటు ఇతర నిధులతో రహదారులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు సీఎం కేసీఆర్. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతోనే జిల్లాల పునర్విభజన సందర్భంగా కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చేసుకున్నట్లు  తెలిపారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అభివృద్ధి పనులను చేపట్టి మౌలిక వసతులు కల్పించాలన్నారు.

సింగరేణి సంస్థ ద్వారా వచ్చే నిధులతో ఏర్పడిన డీఎంఎఫ్‌టీ నిధులు దాదాపు రూ. 1500 కోట్లు అందుబాటులో ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు, నరేగా నిధులు, ఇరిగేషన్ నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సమకూరే నిధులన్నింటినీ అనుసంధానం చేసుకుని సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. ఏ ప్రాంతంలో ఏ అవసరం ఉందో గుర్తించి దాని ప్రకారం పనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి పనులను నిర్ధారించి నిధులు విడుదల చేయాలన్నారు. పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. హామీలను నూటికి నూరు శాతం అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు సింగరేణి సీఎండీ శ్రీధర్. అన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. 2017-18 సంవత్సరంలో 6.2 శాతం వృద్ధిరేటుతో రికార్డు స్థాయిలో 646 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 91.1 శాతం పీఎల్‌ఎఫ్‌తో విద్యుత్ ఉత్పత్తి జరగడంపై కూడా సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో చెప్పినట్లే తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates