సింగరేణిని ప్రైవేటీకరించేది లేదు : సీఎం కేసీఆర్

KCR-Singereniఆరునూరైనా సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేదే లేదన్నారు సీఎం కేసీఆర్. శ్రీరాంపూర్‌లో నిర్వహించిన సింగరేణి కార్మికుల ఆత్మీయ సభలో  మాట్లాడిన సీఎం… కేంద్రప్రభుత్వం దేశంలోని బొగ్గుగనులను ప్రైవేటీకరిస్తానంటోందని.. అవసరం అయితే కేంద్రం వాటా ఇచ్చి పంపిస్తామన్నారు. విద్యుత్ ప్లాంట్లను జెన్కోనే ఏర్పాటు చేస్తుందని చెప్పామన్నారు. కార్మికుల కోసం 10వేల క్వార్టర్స్‌ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్త క్వార్టర్ల నిర్మాణానికి యాజమాన్యం రూ.400 కోట్లు ఇస్తోందన్నారు. కార్మికులకు రేపటి(బుదవారం,ఫిబ్రవరి-28) నుంచి కరెంట్, వాటర్ బిల్లు ఉండదని తెలిపారు. సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న కార్మికుల ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు.

శ్రీరాంపూర్‌లో కొత్తగా ప్రారంభించిన ఆరు గనుల్లో 4,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నామని తెలిపారు. అలియాస్ పేర్లున్న వారికి ఎలాంటి ఇబ్బుందులుండవన్నారు. కార్మికుల కోసం మెడికల్ బోర్టు ఏర్పాటు చేస్తామని…ఇందులో నిమ్స్, ఉస్మానియా, గాంధీ డాక్టర్లు ఉంటారన్నారు. ఎవరైనా లంచాలు అడిగితే…వారిని చెప్పుతో కొట్టండి  అని అన్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు కార్మికులు చందాగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లించాలని సూచించారు.రెండు, మూడు రోజుల్లో టీబీజీకేస్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.

అంతకు ముందు మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ సదుపాయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. శ్రీరాంపూర్‌లో పర్యటించిన ఆయన ఆరు భూగర్భ గనులకు శంకుస్థాపన చేశారు. శ్రీరాంపూర్‌ పర్యటనలో భాగంగా సింగరేణి కార్మికుల క్వార్టర్స్‌ను పరిశీలించారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates