సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ రూ.60,500

బొగ్గుగని కార్మికులకు దసరా బొనాంజాను ప్రకటించింది కోలిండియా. దసరా పండుగను పురస్కరించుకుని నిన్న(శుక్రవారం) ఒక్కొక్క కార్మికుడికి రూ.60,500లను ప్రకటించింది కోలిండియా యాజమాన్యం. ఢిల్లీలో కోలిండియా యాజమాన్యంతో ఐదు జాతీయ కార్మిక సంఘాల నేతలు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఒక్కొక్క కార్మికుడికి దసరా బోనస్‌ కింద రూ.60,500లను ఈనెల 12న కోలిండియా పరిధిలో పంపిణీ చేయనున్నారు. అయితే కోలిండియా యాజమాన్యం ప్రకటించిన ప్రకారం సింగరేణి సంస్థలో కూడా దసరా బోనస్‌ పంపిణీ చేయాల్సి ఉంటుంది. సింగరేణిలో ప్రస్తుతం 53,300మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ కోలిండియా ప్రకటించిన విధంగానే సింగరేణి కూడా బోనస్‌ పంపిణీ చేయనుంది. అయితే సింగరేణి సంస్థలో పంపిణీ తేదీని ప్రకటించనప్పటికీ 12వ తేదీ తర్వాతనే పంపిణీ చేసే అవకాశం ఉంది. సింగరేణి సంస్థ కంపెనీ వ్యాప్తంగా రూ.349 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది దసరా బోనస్‌ను ఒక్కొక్క కార్మికుడికి రూ.57,500లను పంపిణీ చేశారు. గతేడాది కంటే రూ.3వేలు అదనంగా కలిపి రూ.60,500లను ఈసారి పంపిణీ చేయనున్నారు. దసరా పండుగ, దీపావళి అడ్వాన్స్‌, రంజాన్‌, క్రిస్మస్‌ అడ్వాన్సుల కింద కార్మికులకు సింగరేణి సంస్థ పండుగల అడ్వాన్సులను సైతం అందచేయనుంది. మొత్తం మీద ఈ సీజన్‌ రావడంతో సింగరేణి కార్మికులకు వారి జీతాలతోపాటుగా రూ.60 వేలు దసరా బోనస్‌ అదనంగా రావడం వల్ల ఒక్కొక్క కార్మికుడికి లక్ష నుంచి లక్షన్నర వరకు అందే అవకాశాలు ఉన్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates