సిద్దిపేటలో విషాదం: జర్నలిస్టు కుటుంబం ఆత్మహత్య

REPఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ జర్నలిస్టు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట భారత్ నగర్‌లో నివాసం ఉంటున్న హనుమంతరావు ఓ వార్త పత్రికలో జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. ఇటీవల కాలంలో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. కొన్ని అప్పులు కూడా చేశారు. అయితే తీర్చే మార్గం కనిపించలేదు. జీతం కూడా అరకొరగానే ఉంది. ఇద్దరు చిన్నపిల్లలు. ఆర్థిక కష్టాలు తీరే మార్గం కనిపించలేదు అనుకున్నాడో ఏమో.. ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. పురుగుల మందు తెచ్చాడు. పిల్లలకు తాగించాడు. ఆ తర్వాత భార్యభర్తలు తీసుకున్నారు. ఇంటికి వచ్చిన చుట్టుపక్కల వారు విషయం తెలుసుకుని వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వారు చూసే సమయానికే ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారు. మరో గదిలో హనుమంతరావు కూడా విగతజీవిగా కనిపించాడు. అప్పటికే బతికే ఉన్న భార్యను.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హనుమంతరావు భార్య ఆరోగ్యం విషమంగా ఉంది. హనుమంతరావు కొన్నేళ్లుగా ఓ వార్త పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణాలుగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates