సిద్ధు సిక్సర్ కామెంట్ : తెలంగాణ ఇసుక పాలసీని ఫాలో అవుతాం

SIDDUఇసుక మాఫియా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని.. అక్రమంగా రవాణా చేయాలంటేనే భయపడే విధంగా మైనింగ్ పాలసీ ఉందని ప్రశంసించారు పంజాబ్ గనులశాఖ మంత్రి, మాజీ క్రికెటర్ నవ్‌ జ్యోత్‌ సింగ్ సిద్ధు. ఏప్రిల్ నెలలో 11 రోజుల్లోనే ఇసుక ద్వారా రూ.40 కోట్లు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పంజాబ్‌ రాష్ట్రంలో సంవత్సరం మొత్తం కలిపినా ఇంత ఆదాయం రావడంలేదన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఇసుక, మైనింగ్ విధానం, ఆన్‌లైన్‌లో విక్రయం తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి పంజాబ్ గనుల మంత్రిగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ సిద్ధు రాష్ట్రంలో పర్యటించారు. టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు.

ఇసుక విక్రయాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీల పనితీరు, వాల్టా చట్టాల ప్రకారం తీసుకుంటున్న చర్యలు, ఆన్‌ లైన్‌ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్న విధానం బాగున్నాయని ప్రశంసించారు పంజాబ్ మంత్రి సిద్ధు. పర్యావరణ పరిరక్షణతోపాటు ఇసుక విక్రయాలతో ఏ విధంగా ఆదాయం వస్తుందన్న అంశాలను పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో ఇసుక మైనింగ్‌కు తీసుకుంటున్న చర్యలను టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూర్ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates