సినిమాను తలపించిన యాక్షన్ సీన్స్ : కిర్రాక్ పుట్టించిన రౌడీ బర్త్ డే పార్టీ

rowdey-gangవాళ్లందరూ రౌడీలు. దొంగతనాలు, దోపిడీలు, గొడవలు, బెదిరింపులతో నాలుగు రాళ్లు సంపాదిస్తూ దర్జాగా తిరుగుతున్నారు. వీళ్లందరిపై కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం రౌడీలపై నిఘా పెట్టింది. లిస్ట్ తీసి.. వార్నింగ్ ఇచ్చింది. పదేపదే నేరాలు చేస్తున్నవారిని నగర బహిష్కరణ విధించింది. దీంతో వీళ్లందరూ గప్ చుప్ అయ్యారు. అలాగే ఉండిపోతే ఎలా బతికేది.. మనకూ ఓ సంఘం ఉండాలనుకున్నారు. అందరం రౌడీలమే అయినా.. అప్పుడప్పుడు కలుసుకుని సాధకబాధకాలు చర్చించుకోవాలని నిర్ణయించారు. వీరిందరికీ ఓ వేదిక కావాలి. దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా పెద్ద రౌడీ బర్త్ డే పార్టీ వేదిక అయ్యింది.

చెన్నై సూలైమేడ్ కు చెందిన బిన్ని అలియాస్ బిను అనే రౌడీ తన పుట్టిన రోజు పార్టీ ఇచ్చాడు. దీనికి తమిళనాడు రాష్ట్రంలో తనకు పరిచయం ఉన్న 200 మందికి ఆహ్వానం పంపాడు. రౌడీ బర్త్ డే పార్టీ సినిమాను తలపించే విధంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయటానికి చెన్నై సిటీ శివార్లలోని మీంజూరు రింగ్ రోడ్డు సమీపంలోని ఓ లారీ షెడ్ ను ఎంచుకున్నారు. జిగేల్ అనే లైటింగ్ వేశారు. పెద్ద కేక్ తీసుకొచ్చారు. డీజే పెట్టారు. 20 పొటేళ్లు తెగాయి. 200 కోళ్లు కోశారు. 50 కార్టూన్ల బీర్లు తెచ్చారు. 100 బాటిళ్ల మద్యం సిద్ధం చేశారు. హోరెత్తించే పాటలతో.. గానా బజానా.. పార్టీ అంటే కిర్రాక్.. అందులోనూ రౌడీ బాస్ పార్టీ అంటే కేక పుట్టించారు. రౌడీ బాస్ బిను.. కేకును తనదైన స్టయిల్ లో.. పెద్ద కత్తితో కట్ చేసి వారేవా అనిపించాడు.

ఇదే టైంలో పార్టీకి వస్తున్న ఇద్దరు రౌడీలు పోలీసుల కంట పడ్డారు. వాళ్ల అవతారం చూస్తే ఏదో అనుమానం వచ్చింది చెన్నై పోలీసులకు. నాలుగు పీకారు. అంతే అసలు విషయం చెప్పారు. షాక్ అయ్యారు పోలీసులు. కమిషనర్ కు విషయం చెప్పారు. వెంటనే అంబత్తూరు డిప్యూటీ కమిషనర్ సర్వేష్ రాజ్ ఆధ్వర్యంలో ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 40 మంది పోలీసులు తుపాకులతో ఆపరేషన్ మొదలుపెట్టారు. పార్టీ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లగానే షాక్ అయ్యారు. 150 మంది రౌడీలు ఒకే చోట.. మందు కొట్టి.. చిందులు వేస్తున్నారు. వాళ్ల దగ్గర కత్తులు, గొడ్డళ్లు, తుపాకులు కూడా ఉన్నాయి. దీంతో అదనపు ఫోర్స్ తో పోలీసులు దాడి చేశారు. షాక్ అయిన రౌడీలు.. తలో దిక్కుపారిపోయారు. 75 మందిని పట్టుకున్నారు. పార్టీ స్పాట్ చూసి అవాక్కయ్యారు పోలీసులు. దేశ చరిత్రలో ఇలాంటి రౌడీల పార్టీ జరిగి ఉండదని.. ఇంత మంది ఒకేచోట చేరటం అంటే మాటలు కాదని చెబుతున్నారు చెన్నై పోలీస్ కమిషనర్..

Posted in Uncategorized

Latest Updates