సినిమా డైలాగ్ కాదు.. రియల్ : మందు తాగి దొరికితే రూ.50వేల ఫైన్

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్నాడా 10వేల ఫైన్ వేయండి.. రాంగ్ రూట్ లో వెళుతున్నాడా 20వేల ఫైన్ వేయండి.. ఇది ఓ సినిమాలోని డైలాగ్స్.. ఇంత కాకపోయినా రోడ్డెక్కే వాహనదారుల నుంచి ఎంతో కొంత భారీగా జరిమానాలతో వాత పెడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఏకంగా జైలుకో.. ఇప్పటికే మార్పు మొదలైంది.. కాకపోతే ఆ మార్పు శాశ్వతంగా ఉండటానికి.. మళ్లీ తప్పు చేయాలనే ఆలోచన రాకుండా ఉండటానికి బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. అక్కడ మద్య నిషేధం అమల్లో ఉంది. అయినా దొంగచాటుగా విక్రయాలు సాగిస్తున్నారు కొందరు. వీటిని కంట్రోల్ చేయటంతోపాటు.. మందు తాగి దొరికినా.. మద్యం సీసాలతో దొరికినా.. భారీ జరిమానా విధించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయించింది. అది ఎంతో తెలుసా.. అక్షరాల రూ.50వేలు. అవును మందుతో దొరికినా, మందు తాగి దొరికినా 50వేల జరిమానా వసూలు చేయాలని ఆదేశించారు.
జరిమానా కట్టి తీరాల్సిందే అని లేకపోతే మూడు నెలల జైలు విధించేలా చట్ట సవరణలు తీసుకురావటానికి ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. మద్య నిషేధం పక్కాగా అమలు అవ్వటంలో భాగంగా ఈ కఠిన నిర్ణయాలు అని చెబుతోంది ప్రభుత్వం. బీహార్ రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు ఉన్నాయని.. ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తీసుకు వస్తున్నారని నిఘా వర్గాలు నివేదిక ఇచ్చాయి. వీటిని కంట్రోల్ చేయాలంటే వ్యాపారులతోపాటు.. మద్యం తాగే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటేకానీ అదుపులోకి రాదని అధికారులు తేల్చేశారు. ఇందులో భాగంగానే 50వేల జరిమానా ఫిక్స్ చేశారు. అంతే బీహార్ లో మందు కొట్టాలంటే.. జేబులో 50వేల రూపాయలు పెట్టుకోవాలి.. లేకపోతే మూడు నెలలు జైలులో ఉండాలి.. బీహార్ వాళ్లు అంతే అని అందరూ ఆడిపోసుకుంటారు కానీ.. ఎంత మార్పు అండీ..

Posted in Uncategorized

Latest Updates