సీఎం నేనే.. కానీ : ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తున్న కుమారస్వామి

బెంగళూరులో పనిచేసే పౌర ఉద్యోగులకు 6 నెలలుగా జీతాలివ్వడానికి కర్ణాటక ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. కానీ తమ ఎంపీలకు….లక్షల రూపాయలు విలువచేసే ఐఫోన్ లు, ఖరీదైన ల్యాప్ టాప్ బ్యాగ్లను మాత్రం గిఫ్ట్ గా ఇస్తుంది. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎంపీలకు ఖరీదైన ఐఫోన్, ల్యాప్ టాప్ బ్యాగ్ లను పంచిన కుమారస్వామి ప్రభుత్వంపై పలువురు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా రాష్ట్ర ఎంపీలకు ఖరీదైన ఐఫోన్X(రూ.1.02 లక్షలు) ను, ఖరీదైన బ్యాగ్(రూ.5,000) లను ప్రభుత్వం ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగపర్చడమే అవుతుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా కుమారస్వామి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బెంగళూరులోని సివిక్ వర్కర్లకు ప్రభుత్వం 150 కోట్లు చెల్లించాల్సి ఉందని రాజీవ్ తెలిపారు. ఈ విషయంపై సీఎం కుమారస్వామికి లేఖ రాశారు రాజీవ్ చంద్రశేఖర్. 6 నెలలుగా సివిక్ వర్కర్లు జీతాలు చెల్లించకపోవడంతో అప్పుల భాధలు తట్టుకోలేక ఇప్పటికే ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని, రాష్ట్ర రైతులు కూడా పంటలకు గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్నారని, ఇటువంటి సమయంలో ప్రజా ధనాన్ని దుర్వినియోగపర్చడం కరెక్ట్ కాదని ఆ లేఖలో తెలిపారు. తనకు గిఫ్ట్ గా ఇచ్చిన ఐఫోన్ ను కూడా తిరిగి ఇస్తానని రాజీవ్ తెలిపారు.
ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం కుమారస్వామి… ఈ గిఫ్ట్ ల పంపీణీ గురించి తనకు తెలియదన్నారు. ఐఫోన్ లు పంచమని తాను ఎవ్వరికీ చెప్పలేదన్నారు. ఇది జలవనరుల శాఖ మంత్రి డీకే. శివకుమార్ తీసుకున్న నిర్ణయమని తనకు తెలిసిందని, దీనిపై విచారణకు ఆదేశించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates