సుదీర్ఘ చంద్రగ్రహణం : ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతాలు

ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘంగా.. ఆరు గంటలకుపైగా చంద్రగ్రహణం. 103 నిమిషాల పాటు పూర్తిగా రక్త వర్ణం పులుముకోనున్న జాబిలి. ఆ పక్కనే నేనున్నానంటూ మినుకుమినుకుమంటూ మెరిసే అంగారకుడు. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీక్షించే అరుదైన సందర్భం.. మన దేశంలో ఎక్కడి నుంచైనా సంపూర్ణ గ్రహణాన్ని చూసే అవకాశం.. ఇన్ని ఆకాశ అద్భుతాలకు శుక్రవారం రాత్రి వేదిక కాబోతున్నది. ఇదే సమయంలో గ్రహణంపై అపోహలు తొలిగించేందుకు దేశవాసులంతా గ్రహణం సమయంలో ఆహారం తింటూ సెల్ఫీలు తీసుకోవాలని, సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేయాలని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు. 21వ శాతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి ప్రారంభం కాబోతున్నది. ప్రారంభం నుంచి చివరివరకు వివిధ ప్రక్రియలు కలిపి మొత్తం ఆరు గంటలపాటు గ్రహణం కొనసాగనున్నది. గ్రహణం మన దేశంలో శుక్రవారం(27వ తేదీ) రాత్రి 10:45 గంటలకు ప్రారంభమై శనివారం(28వ తేదీ) తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది. రాత్రి ఒంటి గంట నుంచి 2:43 గంటల మధ్య గ్రహణం ఉచ్ఛదశలో ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates