సుప్రీంకోర్టు జడ్జి ఇంటిపై కాల్పులు

pakjudgeపాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ పై ఉన్న కేసుల విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఇజాజ్ ఉల్ ఎహసాన్ ఇంటిపై ఆదివారం (ఏప్రిల్-15) గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. లాహోర్‌ లోని మోడల్ టౌన్‌ లో ఉన్న ఇజాజ్ ఇంటిపై జరిగిన ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆదివారం ఉదయం 4.30, 9 గంటల ప్రాంతంలో రెండుసార్లు ఈ కాల్పులు జరిగినట్లు సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటన జరిగిన వెంటనే పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ మియాన్ సాకిబ్ నిసార్.. ఆ జడ్జి ఇంటికి వెళ్లారు. పంజాబ్ ఐజీ ఆరిఫ్ నవాజ్ ఖాన్‌ కు సమన్లు జారీ చేశారు. చీఫ్ జస్టిసే పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఫోరెన్సిక్ నిపుణులు ఘటన జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు.

లక్ష్యంగా చేసుకొని కాల్చారా లేక గాల్లో కాల్పులు జరిపారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రధాన ద్వారంతోపాటు కిచెన్ డోర్‌ వైపు రెండు బుల్లెట్లు కాల్చారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనను పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీతోపాటు పంజాబ్ సీఎం షాబాజ్ షరీఫ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు ఖండించారు. దీనిపై న్యాయ విచారణ జరపాలని పీపీపీ కోచైర్‌పర్సన్ ఆసిఫ్ అలీ జర్దారీ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నవాజ్ షరీఫ్‌ దే బాధ్యత అని పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. పనామా పేపర్స్ కేసులో ఉన్న షరీఫ్‌ ను జీవితకాలం ఎన్నికల్లో నిలబడకుండా నిషేధించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఈ న్యాయమూర్తి ఇజాజ్ ఎహసాన్ కూడా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates