సుప్రీంలో కేంద్రం అఫిడవిట్  : బయ్యారం స్టీల్ ప్లాంట్ లేదు

BAYYARAM STEEL PLANTతెలుగు రాష్ట్రాల్లో ఉక్కు కార్మాగారాలు సాధ్యం కాదని తేల్చి చెప్పింది కేంద్రం. ఈ రకంగా రెండు రాష్ట్రాల ఆశలపై  నీళ్లు చల్లింది. కడప, ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాలు సాధ్యం కాదని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. విభజన చట్టంలోని హామీల అమలు జాప్యం అవుతోందని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు కేంద్ర ఉక్కు, ఆదాయపన్ను శాఖలు ఇటీవల సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని షెడ్యూలు 13లో ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పరిశీలించాల్సి ఉంది. అపాయింటెడ్‌ డేట్‌ 2014 జూన్ 2 నుంచి 6 నెలలులోగా నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే 2014 డిసెంబర్ 2న  సెయిల్‌ ఇచ్చిన నివేదికలో ఆయా ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు ఆర్థికంగా సాధ్యం కాదని వెల్లడించింది. అనంతరం 2016  అక్టోబర్ 19 లో కేంద్ర  రాష్ట్ర ప్రతినిధులు, సెయిల్‌, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, మెకాన్‌ లిమిటెడ్‌ కలిసి టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశారని, సాధ్యాసాధ్యాలపై మరోసారి పరిశీలించి ఆయా రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలని సూచించామని వివరించింది కేంద్ర ఉక్కుశాఖ. 2017 -డిసెంబర్- 27న చివరి సమావేశం నిర్వహించగా.. మెకాన్‌ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యాసాధ్యాలపై సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని సూచింది ఆ శాఖ. ఇంతకుమించి అదనంగా కోర్టుకు అందించడానికి ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది కేంద్ర ఉక్కుశాఖ.  కేంద్రం నిర్ణయంపై టీడీపీ మండిపడింది. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేస్తానని  ప్రకటించారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్.

Posted in Uncategorized

Latest Updates