సూట్‌కేస్‌లో చిన్నారి మృతదేహం

BOYయజమానిపై ఉన్న కోపంతో అతి కిరాతకంగా అతని కొడుకును చంపేశాడో యువకుడు. యజమాని కొడుకును చంపి నెలరోజుల పాటు చిన్నారి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో దాచిపెట్టాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని స్వరూప్‌ నగర్‌కు చెందిన ఏడేళ్ల ఆశిష్‌ గత నెల 7వ తేదీ నుంచి కనబడకుండా పోయాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అవదేశ్‌ సఖ్య అనే వ్యక్తిపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా  అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆశిష్‌ను చంపింది సఖ్య అని పోలీసులు వెల్లడించారు. చిన్నారి మృతదేహాన్ని సఖ్య ఇంట్లోని సూట్‌కేస్‌లో గుర్తించారు.

మృతదేహం పరిస్థితిని చూస్తుంటే నెల రోజుల క్రితమే హత్య చేసినట్లుగా ఉందని పోలీసులు కనుగొన్నారు. హత్యకు గల కారణం స్పష్టంగా తెలియనప్పటికీ.. వ్యక్తిగత కక్షలే ఘటనకు దారి తీసినట్లు పోలీసులు అనుమానించారు. అవదేశ్‌ సఖ్య గత ఎనిమిదేళ్లుగా ఆశిష్‌ వాళ్ల ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాడు. మొదట్లో అందరూ ఒకే భవనంలో ఉండగా, ఐదేళ్ల క్రితం ఆశిష్‌ కుటుంబానికి చెందిన మరో ఇంట్లోకి మారాడు. అయితే సఖ్య ప్రవర్తన ఆశిష్‌ తల్లిదండ్రులకు నచ్చలేదు. పలుమార్లు సఖ్యను హెచ్చరించారు. అంతేగాక.. సఖ్యతో సన్నిహితంగా ఉండే ఆశిష్‌ను కూడా తనతో మాట్లాడనిచ్చేవారు కాదు. దీనితో ఆశిష్‌ తండ్రిపై కోపం పెంచుకున్న సఖ్య ఈ ఘటనకు పాల్పడ్డానని వివరించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates