సూపర్ తెలంగాణ పోలీస్ : తప్పిపోయిన అస్సాం బాలికను తల్లి ఒడికి చేర్చారు

హైదరాబాద్‌: 2 సంవత్సరాల కిందట తప్పిపోయిన బాలిక తెలంగాణ పోలీసుల పుణ్యమా అని… అమ్మ ఒడికి చేరింది. అస్సాంకి చెందిన బాలిక ఆచూకీ కనుక్కొనేందుకు… తెలంగాణ పోలీస్‌ రూపొందించిన ‘ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌’  యాప్ ఉపయోగపడింది. అస్సాంలోని లక్మీపూర్‌ బోగినోడి గ్రామానికి చెందిన అంజలి టిగ్గా(16).. 2017, ఆగస్టులో ఇంటి నుంచి తప్పిపోయి.. ఢిల్లీకి చేరి, అక్కడ నెల రోజుల పాటు కార్మికురాలిగా పనిచేసింది.

పనిచేస్తున్న చోట ఇతర కార్మికులందరూ కలిసి మళ్లీ తనను అస్సోం పంపించారు. అస్సాం రైల్వే స్టేషన్‌ కు చేరిన అంజలి.. ఇంటికి వెళ్లేందుకు భయపడి సోనిత్‌ పూర్‌ లో ఏదైనా పనిచేసుకుని జీవించాలని నిర్ణయించుకుంది. అయితే, రైల్వే స్టేషన్‌ లో అంజలిని గుర్తించిన రైల్వే పోలీసులు ఆమెను చైల్డ్, ఉమెన్‌ కేర్‌ (CWC)  సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. తెలంగాణ పోలీసులు తయారుచేసిన ఫేస్‌ రికగ్నైజ్‌ యాప్‌ లోని డేటా బేస్‌ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మిస్సయిన వారి ఫొటోలు, వివరాలు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రుల వివరాలు చెప్పేందుకు అంజలి నిరాకరించగా.. అక్కడి సంస్థ ప్రతినిధులు ఆమె ఫొటోలను తెలంగాణ పోలీస్‌ రూపొందించిన ఫేస్‌ రికగ్నైజేషన్‌ డేటా బేస్‌ యాప్ లో సరిపోల్చి చూశారు. ఫేస్ సేమ్ ఉందని గుర్తించారు.

యాప్ లో అంజలి అడ్రస్‌ అందుబాటులో ఉండగా.. ఆమెను ఆదివారం డిసెంబర్-16న అస్సాంలోని బోగినోడిలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరును మెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా. బిడ్డను చూడగానే కన్నీరుమున్నీరయ్యింది కన్నతల్లి. మిస్సింగ్ అయినప్పట్నుంచీ వెతకని చోటులేదని, అసలు బతికుందో లేదో, వస్తదో రాదో అని గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చేవారిమని తెలిపింది బాలిక తల్లి. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసుల మేలు ఎప్పటికీ మరచిపోను అని చెప్పింది.

 

Posted in Uncategorized

Latest Updates