సేవ్ శబరిమల: 795 కి.మీ. భారీ క్యూలో మహిళల దీపాల ప్రదర్శన

శబరిమల కొండపై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం పవిత్రత కాపాడాలి అంటూ కేరళలోని మహిళలు అత్యంత భారీ ప్రదర్శన చేశారు. సుప్రీంకోర్టు గతంలో శబరిమల గుడి విషయంలో ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని విజ్ఞప్తిచేశారు. భక్తుల మనోభావాలను గౌరవించాలని వేడుకున్నారు.

కేరళలో మహిళా భక్తులు చైతన్యం చూపించారు. కేరళలోని అనేక పట్టణాలు, గ్రామాలు, రహదారులను కలిపేలా… మొత్తం 795 కిలోమీటర్ల మేర మహిళలు భారీ ప్రదర్శన చేశారు. దీపాలను వెలిగించి.. సంప్రదాయ వస్త్రధారణలో రోడ్డుకు రెండు పక్కలా నిలబడి తమ అభిప్రాయాలను ముక్తకంఠంతో చెప్పారు. కేరళకు ఉత్తరాన ఉన్న కసర్గాడ్ జిల్లా హోసంగడి నుంచి.. దక్షిణాన ఉన్న రాజధాని తిరువనంతపురం మీదుగా.. కన్యాకుమారిలోని త్రివేణి వరకు… దీపాల ప్రదర్శన చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల ముప్పై నిమిషాల వరకు దీపాలు వెలిగించారు. . శబరిమలలోని ప్రఖ్యాత అయ్యప్ప స్వామి ఆలయానికి ఉన్న పవిత్రత, సంప్రదాయం కాపాడాలి అంటూ నినదించారు.

మహిళలు, యువతులు, చిన్న పిల్లలు ఇలా అన్ని వర్గాల వాళ్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పురుషులు కూడా మహిళలకు మద్దతు తెలుపుతూ జ్యోతులు వెలిగించి తమ ఆకాంక్ష చాటారు. డీజీపీ టీపీ సేన్ కుమార్, నటుడు-బీజేపీ ఎంపీ సురేష్ గోపి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. శబరిమల కర్మ సమితి పిలుపుతో మహిళలంతా ఇలా తమ ఐక్యతను చూపించారు. పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల అయ్యప్ప గుడిలోకి ప్రవేశం లేదు.  దీనికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలంటూ మహిళలు నినదించారు.

వాల్ ఆఫ్ దియాస్ వర్సెస్ వాల్ ఆఫ్ ఉమెన్

సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతుగా కేరళ ప్రభుత్వం .. జనవరి 1న ‘వాల్ ఆఫ్ ఉమెన్’ పేరుతో ఓ భారీ ప్రదర్శన చేసేందుకు సిద్ధమైంది. దీనికి కౌంటర్ గా బీజేపీ, ఇతర హిందూత్వ సంఘాలు ‘వాల్ ఆఫ్ దియాస్’ కార్యక్రమాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్వహించారు.

Posted in Uncategorized

Latest Updates