సైనికుల ఆయుధాల కొనుగోలుకు నిధుల కొరత

indian-armyదేశ రక్షణ కోసం ఆయుధం పట్టి బోర్డర్ లో కను రెప్పవాల్చకుండా కాపలా కాస్తారు సైనికులు. ఎప్పుడు..ఎటువైపు నుంచి శత్రువులు దాడి చేస్తారో తెలియని పరిస్థితిలో ఆయుధాలను ఎక్కు పెట్టి మరీ గస్తీ నిర్వహిస్తారు. శత్రువులను ఎదుర్కోవాలంటే…వారి కంటే లేటెస్ట్ ఆయుధాలు మన దగ్గర ఉండాలి. అయితే లేటెస్ట్ రైఫిళ్ల కోసం పెడుతున్న ఆర్డర్‌ను 2.5లక్షలకే పరిమితం చేయాలని సైన్యం నిర్ణయించింది. కావాల్సిన తుపాకుల సంఖ్యలో ఇది మూడో వంతుగా ఉంది. నిధుల కొరత, వేగంగా ఆయుధాలను అందుకోవాల్సిన అవసరం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రైఫిళ్లను ప్రధానంగా పదాతి దళ సైనికులు ఉపయోగిస్తుంటారు. వీరు కశ్మీర్‌, నియంత్రణ రేఖ, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదులు, శత్రు సైనికుల నుంచి తీవ్ర దాడులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీరు వినియోగిస్తున్న ఇన్సాస్‌ రైఫిల్‌కు కాలం  చెల్లింది. దీంతో ఆధునిక తుపాకులను కోనుగోలుపై సైన్యం దృష్టిపెట్టింది. 250 కోట్ల డాలర్లతో 8లక్షల రైఫిళ్లను కొనుగోలు చేయాలని మొదట నిర్ణయించింది. అధికారుల అలసత్వం వంటి కారణాలతో ఇది ఇంతకాలం ఆలస్యమవుతూ వస్తోంది. దీనికితోడు బడ్జెట్‌ కొరత వంటి కారణాలతో ఈ సంఖ్యను తాజాగా కుదించింది. ఇప్పుడు 2.5 లక్షల ఆయుధాలకే ఆర్డర్లు పెట్టబోతోంది. ఈ నెలాఖరులో సైనిక బృందాలు.. ఇటలీ, స్విట్జర్లాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, ఇజ్రాయెల్‌ వెళ్లి, అక్కడి ఆయుధ తయారీ కంపెనీలతో సమావేశమవుతాయి. సైన్యం అవసరాలు తీర్చే లేటెస్ట్ వెపన్స్ ఎంపిక చేస్తాయి. మిగతా సైనికుల అవసరాలను ఏకే శ్రేణి, ఇన్సాస్‌ తుపాకులతో తీర్చాలని సైన్యం భావిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates