సోషల్ రూమర్ల భూతం : కొత్తోళ్లు కనిపిస్తే చావకొడుతున్నారు

unknown-peopleకొత్త వ్యక్తి కనిపించాడు.. మన భాష రాలేదు.. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేడు.. అంతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అందరూ కలిసి కొట్టేయటం.. చచ్చేలా చావకొట్టటం జరిగిపోతున్నాయి. ఇప్పుడు గ్రామాల్లో ఇదే పరిస్థితి. మొన్నటికి మొన్న తమిళనాడు, కేరళలో జరిగిన వరస ఘటనలు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వ్యాపించాయి. బీహార్, యూపీ రాష్ట్రాల నుంచి పిల్లలను ఎత్తుకెళ్లు ముఠాలు గ్రామాల్లో తిరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో.. ఇప్పుడు కలకలం రేపుతోంది.

మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలో, నిన్న మంచాల మండలం చిదేడ్, మాడుగుల మండలం కర్మేడ్ గ్రామాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తీవ్రంగా కొట్టారు. మే 21వ తేదీ సోమవారం ఉదయం మంచాల మండలం ఆగపల్లిలో ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు ప్రాణాలు పోయేలా కొట్టారు. పిల్లలను ఎత్తుకెళ్లేవారని.. ఇళ్లల్లో దొంగతనాలు చేసేవారంటూ విపరీతంగా కొట్టారు. కాళ్లు, చేతులు విరిగేలా.. ముఖంపై పడిగుద్దులతో చచ్చేలా కొట్టారు. వాళ్లు భాష స్థానికులు అర్థం చేసుకోకపోవటం, అందులోనూ కొత్త వాళ్లు కావటంతో గ్రామస్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. తీవ్రంగా గాయపడిన వారిని మంచాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే చాలాసేపు ఉంచారు. ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు వారు. వీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు.. ఎందుకు వచ్చారు.. ఏం చేస్తున్నారు.. నిజంగా దొంగలేనా.. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠానా అనే విషయాలపై తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates