స్కూలు పిల్లలే నయం: ఎంపీలపై స్పీకర్ అసహనం

లోక్ సభ లో సభ్యులు గందరగోళం సృష్టించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ( మంగళవారం) సభ ప్రారంభమైనప్పటినుంచి సభ్యులు నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఇవాళ  సభ ప్రారంభంనుంచే బీజేపీ సభ్యులు…. రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, తమిళనాడు ఎంపీలు మెకెదాటు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభ్యులు పోడియం దగ్గర నుంచి తమ సీట్లలోకి వెళ్లాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కోరారు. ఒక దశలో సుమిత్రా మహాజన్‌ ఆందోళన చేస్తున్న సభ్యులకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ తమ సీట్లలోకి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు వారిపై అసహనం వ్యక్తం చేశారు. స్కూలు పిల్లల ప్రవర్తనే మీ కంటే బెటర్‌గా అంటూ చురకలు వేశారు.

లోక్‌సభ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభం కాగానే విపక్ష పార్టీలు తమ తమ డిమాండ్లపై సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో మధ్యాహ్నం ఒక సారి సభ వాయిదాపడింది. తిరిగి సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే మళ్లీ నిరసనలు హోరెత్తాయి. గందరగోళ పరిస్థితుల మధ్య సభా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ అధికార, విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates